పోలీస్‌స్టేషన్‌లో నిందితుడి ఆత్మహత్యాయత్నం
నల్లగొండ క్రైం: అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న నల్లగొండ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఒక్క ఘటనతో ఉలిక్కిపడింది. ఆటో దొంగతనం కేసులో విచారణ కోసం తీసుకువచ్చిన ఓ నిందితుడు ఉన్నట్టుండి తన బెల్టుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం పోలీసు వర్గాల్లో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... నల్లగొండ పట్టణంలో ఆటోలను దొంగలిస్తున్నాడన్న అనుమానంతో కట్టంగూరు మండల కేంద్రానికి చెందిన రాజు అనే వ్యక్తిని పోలీసులు విచారణ నిమిత్తం తీసుకువచ్చారు. మూడు రోజుల నుంచి అతడిని స్టేషన్లోనే ఉంచి విచారిస్తున్నారు. అయితే, సోమవారం ఉదయం బాత్రూంకు వెళ్లిన రాజు తన బెల్టుతో మెడకు బిగించుకున్నాడు. దీన్ని గమనించిన పోలీసులు అప్రమత్తమై అతడిని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే రాజు ర క్తం కక్కినట్టు సమాచారం. దీంతో హుటాహుటిన అతడిని జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం రాజు ఆరోగ్య పరిస్థితి గురించిన పూర్తి సమాచారం కూడా తెలియరావడం లేదు. అతడు బాగానే ఉన్నాడని పోలీసు వర్గాలంటుంటే... విషమంగా ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, ఈ నిందితుడికి ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ ఎస్ఐ ఎస్కార్టుగా ఉన్నారు. అసలు, విచారణ సమయంలో నిందితుల ఒంటిపై ఎలాంటి వస్తువులు లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, రాజు విషయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు. అయితే, పోలీసులు కొడతారేమోననే భయంతోనే రాజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసు వర్గాలు చాలా గోప్యంగా ఉంచుతున్నాయి.