పనామా ప్రకంపనలపై నోరువిప్పిన ఐశ్యర్య!
పనామా పత్రాల వివాదంపై బాలీవుడ్ హీరోయిన్, అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్యర్యరాయ్ తాజాగా స్పందించింది. పన్ను ఎగ్గొట్టేందుకు విదేశాల్లో బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసిన వ్యవహారంలో ఐశ్యర్య, ఆమె తల్లి తరఫు కుటుంబసభ్యుల పేర్లు ఉన్నట్టు ఇటీవల పనామా పత్రాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించి సహకరిస్తున్నట్టు ఆమె తెలిపారు.
'ఇప్పటికే ఈ విషయమై ఓ ప్రకటన చేశాను. ఈ విషయంలో కుటుంబపరంగా, వ్యక్తిగతంగా కూడా ప్రకటన చేశాం. మీడియాకు కూడా మా వైఖరి తెలియజేశాం. ఇక ఈ విషయంలో అన్ని ప్రశ్నలకు ప్రభుత్వానికి సమాధానం ఇస్తున్నాం. థాంక్యూ' అంటూ ఆమె పేర్కొన్నారు. ఆమెను మంగళవారం విలేకరులు పనామా పత్రాల విషయమై ప్రశ్నించగా ఈ మేరకు బదులిచ్చారు.
పనామాకు చెందిన మొసాక్ ఫోన్సెకా కంపెనీ ద్వారా విదేశాల్లో బోగస్ కంపెనీలు స్థాపించిన 500 మంది భారతీయ ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్, ఐశ్యర్యరాయ్ కూడా ఉన్నారని ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తన పేరును దుర్వినియోగం చేసి ఈ కంపెనీలు స్థాపించారని, వీటి గురించి తనకు తెలియదని అమితాబ్ వివరణ ఇచ్చారు. ఐశ్యర్య అధికార ప్రతినిధి కూడా ఆమెపై వచ్చిన ఆరోపణలను గతంలో తోసిపుచ్చారు.