సెన్సెక్స్‌కు ‘గ్యాస్’ జోష్!
కేజీ డీ6 బేసిన్ నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధరను వచ్చే ఏడాది నుంచి రెట్టింపు చేసుకునేందుకు కేంద్ర కేబినెట్ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)ను అనుమతించడంతో శుక్రవారం ఆయిల్ షేర్ల నేతృత్వంలో మార్కెట్ భారీ ర్యాలీ జరిపింది. బీఎస్ఈ సెన్సెక్స్ 371 పాయింట్లు ఎగిసి తిరిగి 21,000 స్థాయిపైన ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో 6,274 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నవంబర్ 25 తర్వాత ఇదే అతిపెద్ద ర్యాలీ. ఆ రోజున సెన్సెక్స్ 388 పాయింట్లు పెరిగింది. స్టాక్ సూచీల్లో దాదాపు 10% వెయిటేజి వున్న రిలయన్స్ షేరు 4.6% పెరగడంతో తాజా ర్యాలీ సాధ్యపడింది.
ఈ షేరు 6 వారాల గరిష్టస్థాయి రూ. 895 వద్ద ముగిసింది. ఓఎన్జీసీ సైతం 4 శాతం పెరిగింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీని ప్రతిబింబిస్తూ ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్‌లు మరో 1-3 శాతం మధ్య పెరిగాయి. మొదటి మూడు షేర్లు కొత్త గరిష్టస్థాయిల వద్ద ముగిసాయి. బ్యాంకింగ్ షేర్లు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు కూడా 1-2% పెరిగి మార్కెట్ ర్యాలీలో పాలుపంచుకున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మరో రూ.990 కోట్ల పెట్టుబడుల్ని భారత్ మార్కెట్లోకి కుమ్మరించారు. వీరు వరుసగా నాలుగురోజుల్లో రూ. 6,000 కోట్ల డాలర్లకుపైగా పెట్టుబడిచేయడం విశేషం. దేశీయ సంస్థలు రూ. 247 కోట్లు వెనక్కుతీసుకున్నాయి.
వెలుగులో మిడ్‌క్యాప్ షేర్లు....
చాలా రోజుల తర్వాత అధిక సంఖ్యలో వివిధ రంగాలకు చెందిన మిడ్‌క్యాప్ షేర్లు పరుగులు తీసాయి. ఎఫ్ అండ్ ఓ విభాగంలో ట్రేడయ్యే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, జీఎంఆర్ ఇన్ఫ్రా, కర్ణాటకబ్యాంక్, హెచ్‌డీఐఎల్, యునెటైడ్ ఫాస్పరస్, రూరల్ ఎలక్ట్రికల్స్, హెక్సావేర్ షేర్లు 4.5-7.5 శాతం మధ్య పెరిగాయి. నగదు విభాగంలో ట్రేడయ్యే రియల్టీ షేరు అనంత్‌రాజ్ 20 శాతం పెరగ్గా, ఐటీ షేరు మాస్తెక్ 15%ఎగిసింది. జేఎం ఫైనాన్షియల్, రేమండ్, ఎంసీఎక్స్, నెట్వర్క్ 18, డెన్ నెట్వర్క్స్, ఎన్సీసీ, మైండ్ట్రీలు 8-11% మధ్య పెరిగాయి.
ఇన్వెస్టర్ల సంపద లక్ష కోట్ల రూపాయిల మేర పెరిగింది. రంగాల వారీగా ఆయిల్ ఆండ్ గ్యాస్ ఇండెక్స్ అన్నింటికంటే అధికంగా 3.83 శాతం ఎగిసింది. రియల్టీ, ఆటోమొబైల్ సూచీలు 2 శాతం చొప్పున పెరగ్గా, బ్యాంకింగ్ సూచి 1.81 శాతం ర్యాలీ జరిపింది. ఐటీ సూచి 1.6 శాతం పెరిగింది. ఎన్నో నెలల తర్వాత మార్కెట్లో అధికశాతం షేర్లు పెరగడం విశేషం.
ఆర్ఐఎల్ కౌంటర్లో షార్ట్ కవరింగ్...
కేజీ డీ-6లో ఉత్పత్తి నానాటికీ తగ్గడం, గ్యాస్ ధర పెంపుపై వివాదం కొనసాగడంతో కొద్దిరోజులుగా ఆర్ఐఎల్ కౌంటర్లో భారీగా షార్ట్ బిల్డప్ జరుగుతోంది. ఈ కారణంగానే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్ సూచీలు కొత్త రికార్డుకి పెరిగినా, ఆర్ఐఎల్ షేరు రూ.880 స్థాయినీ దాటలేకపోయింది. ఈ వారంలోనే మూడున్నర నెలల కనిష్టస్థాయి రూ.836 వద్దకు పడింది కూడా. గ్యాస్ ధర పెంపుతో... షార్ట్ పొజిషన్లలో కొంత కవర్కావడంతో షేరు 4.5% పెరిగింది. కవరింగ్‌కు సంకేతంగా ఆర్ఐఎల్ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్(ఓఐ) నుంచి ఒక్కసారిగా 21.56 లక్షల షేర్లు (18%) కట్ అయ్యాయి. దాంతో మొత్తం ఓఐ 94.36 లక్షల షేర్లకు దిగింది. వారం నుంచి ప్రతీ రోజూ బిల్డప్ పెరుగుతున్న రూ.860, రూ.880 స్ట్రయిక్స్ కాల్ ఆప్షన్ల నుంచి మూడేసి లక్షల చొప్పున షేర్లు కట్ అయ్యాయి. రూ. 900 కాల్ ఆప్షన్ నుంచి 81 వేల షేర్లు తగ్గాయి. అయితే ఆర్ఐఎల్కు నెలల తరబడి నిరోధం కల్పిస్తున్న రూ. 920 స్థాయి వద్ద కాల్ బిల్డప్ జరగడంతో 2.72 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. రూ.880 స్థాయిని ఆర్ఐఎల్ పరిరక్షించుకోగలిగితే, వచ్చే కొద్ది సెషన్లలో రూ. 920 స్థాయిని చేరవచ్చని, రూ. 880 స్థాయిని ముగింపులో కోల్పోతే క్రమేపీ బలహీనపడవచ్చని డేటా సూచిస్తున్నది.