oil companys
-
చార్జింగ్ స్టేషన్లకు రూ.800 కోట్లు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఫాస్ట్ చార్జింగ్ ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వ రంగంలోని మూడు చమురు కంపెనీలకు రూ.800 కోట్లు మంజూరు చేసినట్టు భారీ పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్–2 కింద ఈ మొత్తాన్ని సమకూరుస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీలు దేశవ్యాప్తంగా ఫిల్లింగ్ సెంటర్లలో 7,432 చార్జింగ్ కేంద్రాలను 2024 మార్చి నాటికి ఏర్పాటు చేస్తాయి. ఈ స్టేషన్స్‌లో ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్లు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, చిన్న బస్‌లకు చార్జింగ్ సౌకర్యాలు ఉంటాయి. ఈ మూడు కంపెనీలకు తొలి విడతగా రూ.560 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,586 చార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. కొత్తగా జోడించనున్న కేంద్రాలతో ఎలక్ట్రిక్ వాహన రంగానికి మంచి బూస్ట్‌నిస్తుందని భారీ పరిశ్రమల శాఖ తెలిపింది. -
సవరించని అమ్మకాల ధరలు, ఆయిల్ కంపెనీలకు భారీ షాక్!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా.. వాటి విక్రయ ధరలను సవరించకుండా నిలిపివేయడం వల్ల ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ లాభాలపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభావం పడుతుందని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ద్రవ్యోల్బణం లక్ష్యిత స్థాయికు మించి పరుగులు తీస్తుండడంతో కేంద్ర ప్రభుత్వ పరోక్ష ఆదేశాల మేరకు.. నాలుగు నెలలుగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించడం లేదు. కానీ, ఇదే కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధరలు పెరిగినందున లాభాలపై ప్రభావం పడుతుందని ఫిచ్ తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల క్రెడిట్ మెట్రిక్స్ బలహీనపడతాయని పేర్కొంది. చదవండి👉పెట్రో లాభాలపై పన్ను పిడుగు! కేంద్ర ఖజానాకు లక్షకోట్లు! అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గే అవకాశాల నేపథ్యంలో 2023–24 నుంచి మెరుగుపడొచ్చని అంచనా వేసింది. సమీప కాలంలోచమురు ధరలు అన్నవి.. ప్రభుత్వ ద్రవ్య అవసరాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లపై ఆధారపడి ఉంటాయని పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వ జోక్యం మరింత కాలంపాటు కొనసాగి, చమురు మార్కెటింగ్ కంపెనీల నష్టాలకు దారితీస్తే వాటి రేటింగ్‌పై ప్రభావం పడొచ్చని తెలిపింది. -
వీధివీధినా పెట్రోల్, డీజిల్!
ముంబై: వీలైతే వీధి చివర్లో ఉన్న రిటైల్ దుకాణాల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసుకునే అవకాశం త్వరలోనే రానుంది.! ఎందుకంటే ఆయిల్ కంపెనీలు కాని ఇతర సంస్థలను కూడా ఇంధనాల రిటైల్ విక్రయంలోకి అనుమతించే ప్రతిపాదనపై ప్రజల నుంచి అభిప్రాయాలకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తాజాగా ఆహ్వానం పలికింది. రెండు వారాల పాటు ప్రజాభిప్రాయాలను సేకరించాక తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు ఇంధనాల రిటైల్‌లోకి అడుగుపెట్టాలంటే... సొంత రిఫైనరీలతోపాటు కనీసం రూ.2,000 కోట్ల పెట్టుబడులు ఉండాలని లేదా అన్వేషణా ఉత్పత్తి సంస్థ అయితే ఏటా మూడు మిలియన్ టన్నుల చమురు ఉత్పత్తి అయినా కలిగి ఉండాలనే నిబంధన ఉంది. ఇది చాలా సంస్థల ప్రవేశాలకు అడ్డుగా ఉంది. అయితే, ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తన నివేదికలో ఈ నిబంధనను రద్దు చేయాలని సూచించడం గమనార్హం. మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణలను ఎత్తివేశాక కూడా దేశ, విదేశీ ఆయిల్ కంపెనీలు రిటైల్ అవుట్లెట్ల విస్తరణపై అనుకున్నదాని కంటే తక్కువే ఆసక్తి చూపించడంతో ఇతర సంస్థలనూ అనుమతించడంపై కేంద్రం ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఇక ప్రభుత్వరంగ చమురు సంస్థల మధ్య ధరల పరంగా పోటీ కూడా లేని పరిస్థితే కొనసాగుతోంది. ఇతర కంపెనీలకూ చోటు ‘‘ఆయిల్ అండ్ గ్యాస్ విభాగంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసిన లేదా పెట్టుబడులకు ప్రతిపాదించిన కంపెనీలకే ఇంధనాల మార్కెటింగ్ హక్కులు కల్పించడం అన్నది ప్రోత్సాహకంగా అనిపించడం లేదు. కనుక ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలకే మార్కెటింగ్ అధికారం కొనసాగించడం అనేది పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టలేని కంపెనీలు ఈ విభాగంలో పాల్గొనకుండా చేయడమే అవుతుంది. కాకపోతే మరింత కస్టమర్ అనుకూల మార్కెట్‌గా మార్చేందుకు భిన్నమైన ఆఫర్లు చేయవచ్చు’’ అని నిపుణుల కమిటీ తన నివేదికలో కేంద్రానికి సూచించడం గమనార్హం. 2019 ఏప్రిల్ 1 నాటికి దేశవ్యాప్తంగా 64,624 ఇంధన రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయి. ఇందులో 57,944 రిటైల్ అవుట్లెట్లు ప్రభుత్వఆయిల్ మార్కెటింగ్ కంపెనీలవి. ఎంఆర్‌పీఎల్ నిర్వహణలో 7, రిలయన్స్, నయారా ఎనర్జీ, షెల్ ఇండియా నిర్వహణలో 6,673 ఉన్నాయి. కంపెనీల అర్హతలు.. ఈ రంగంలోకి చాలా కంపెనీలకు ద్వారాలు తెరిచినట్టవుతుందని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఇప్పటికే టోరెంట్, టోటల్, ట్రాఫిగ్రా ఆసక్తి చూపినట్టు తెలిపారు. నూతన విధానంలో భాగంగా ఇంధన రిటైల్‌లోకి ప్రవేశించే ఏ కంపెనీ అయినా ఆయిల్ రిఫైనరీ సంస్థతో ఒప్పందం చేసుకుని తమ బ్రాండ్ కింద విక్రయాలు చేసుకోవచ్చని ఆ అధికారి తెలిపారు. అయితే, రాత్రికి రాత్రి ఎవరు పడితే వారు ఇందులోకి అడుగుపెట్టకుండా, కనీసం రూ.250 కోట్ల నెట్‌వర్త్ ఉన్న కంపెనీలనే ఇంధన రిటైల్‌లోకి అనుమతించే అవకాశం ఉందని చెప్పారాయన. ‘‘పైగా 5 శాతం రిటైల్ విక్రయ శాలలను గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ఆసక్తి లేకపోతే అప్‌ఫ్రంట్ ఫీజు కింద ఒక్కో రిటైల్ అవుట్లెట్కు గాను రూ.2 కోట్లు చెల్లించడం లేదా రూ.3 కోట్లకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే, కార్యకలాపాలు ఆరంభించిన తర్వాత తదుపరి ఏడేళ్ల కాలంలో ఏటా ఎన్ని విక్రయ శాలలు ఏర్పాటు చేస్తారనే ప్రణాళికలను కూడా సమర్పించాలి. ఈ లక్ష్యంలో వెనుకబడితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది’’ అని ఆ అధికారి వెల్లడించారు. -
సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.89 పెంపు
న్యూఢిల్లీ: ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. 14.2 కిలోల బరువున్న సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.2.89, సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్‌పై రూ.59 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించిన నేపథ్యంలో సబ్సిడీలేని సిలిండర్‌పై రూ.59 పెంచామని వెల్లడించింది. ఇక జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.89 అదనపు భారం పడిందని పేర్కొంది. అలాగే వినియోగదారులకు చెల్లిస్తున్న నగదు బదిలీ మొత్తాన్ని రూ.320.49 నుంచి రూ.376.6కు పెంచినట్లు ఐవోసీ తెలిపింది. -
ధరలు పెంచవద్దన్న ఆదేశాలు లేవు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను పెంచవద్దంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని ఐఓసీ, హెచ్‌పీసీఎల్ కంపెనీలు స్పష్టం చేశాయి. వచ్చే నెలలో కర్ణాటకలో ఎన్నికలు ఉన్నందున ఇంధనాల ధరలు పెంచవద్దంటూ కేంద్రం నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని ఈ రెండు కంపెనీల అధినేతలు స్పష్టం చేశారు. నష్టాల్లో ఆయిల్ షేర్లు...: సిరియాపై దాడి, తదనంతర పరిణామాలతో పశ్చిమాసియా రాజకీయాలు వేడెక్కడం, అమెరికాలో చమురు నిల్వలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ బ్యారెల్ చమురు ధర నాలుగేళ్ల గరిష్టానికి, 71 డాలర్లకు ఎగియడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎమ్‌సీ) షేర్లు నష్టపోయాయి. ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, ఎన్నికల సంవత్సరం కావడంతో పెట్రోలియం ఇంధన ధరలు పెంచవద్దని ఓఎమ్సీలను ప్రభుత్వం ఆదేశించిందన్న వార్తల కారణంగా హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ షేర్లు 8 శాతం వరకూ పతనమయ్యాయి. మరోవైపు చమురు ఉత్పత్తి కంపెనీలు ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలు చెరొక శాతం లాభపడ్డాయి. చమురు ధరల పెరుగుదల భారత్‌కు మంచిదికాదు: ఐఈఏ చమురు ధరల పెరుగుదల భారత్ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఈడీ బిరోల్ బుధవారం పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన 16వ అంతర్జాతీయ ఇంధన సదస్సులో మాట్లాడుతూ.. చమురు ధరల పెరుగుదల దిగుమతులపై ఆధారపడుతున్న భారత్‌కు ఇది మరీ ప్రతికూలమనీ వ్యాఖ్యానించారు. ఇక చమురు ఉత్పాదక దేశాల పరంగా చూస్తే, దీర్ఘకాలంలో ఆయా దేశాల ఆర్థిక స్థిరత్వానికి చమురు ధరల భారీ పెరుగుదల మంచిదికాదన్నారు. -
రూ.కోట్లు మీకు.. కష్టాలు మాకా?
చమురు సంస్థలపై విశ్వరూప్ మండిపాటు అమలాపురం టౌన్ : కోనసీమలో చమురు సంస్థలు రూ.కోట్లకు కోట్లు లాభాలను ఆర్జిస్తున్నాయి మినహా ఆయా సంస్థల కార్యకలాపాల వల్ల తలెత్తుతున్న అపాయాల నుంచి ప్రజలకు రక్షణ కొరవడిందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆందోళన వ్యక్తం చేశారు. అల్లవరం మండలం తాడికోనలో ఓఎన్జీసీ రిగ్ నుంచి ఎగజిమ్ముతున్న గ్యాస్‌ను అదుపు చేయకపోతే, ఆ గ్యాస్ మండితే కోనసీమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కోట్లు మీకు కష్టాలు మాకా...? అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఆయా సంస్థల లాభాల్లో ఒక శాతం ఇక్కడి రక్షణ, అభివృద్ధికి వెచ్చిస్తే, ఈ ప్రాంత ప్రజల్లో ధైర్యం, సంతృప్తి ఉంటుందని వివరించారు. చమురు సంస్థల రిగ్‌లు, బావుల సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు.. ఎప్పుడు, ఏ బ్లోఅవుట్ సంభవిస్తుందోనని కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారని చెప్పారు. రక్షణపరంగా సాంకేతిక జాగ్రత్తలు తీసుకోకుండా కార్యకలాపాలు చేస్తే, ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ కూడా ప్రజలతో మమేకమై, ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.