- చమురు సంస్థలపై విశ్వరూప్ మండిపాటు
రూ.కోట్లు మీకు.. కష్టాలు మాకా?
Published Sat, Sep 10 2016 8:27 PM | Last Updated on Thu, Jul 11 2019 8:35 PM
అమలాపురం టౌన్ :
కోనసీమలో చమురు సంస్థలు రూ.కోట్లకు కోట్లు లాభాలను ఆర్జిస్తున్నాయి మినహా ఆయా సంస్థల కార్యకలాపాల వల్ల తలెత్తుతున్న అపాయాల నుంచి ప్రజలకు రక్షణ కొరవడిందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆందోళన వ్యక్తం చేశారు. అల్లవరం మండలం తాడికోనలో ఓఎన్జీసీ రిగ్ నుంచి ఎగజిమ్ముతున్న గ్యాస్‌ను అదుపు చేయకపోతే, ఆ గ్యాస్ మండితే కోనసీమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కోట్లు మీకు కష్టాలు మాకా...? అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఆయా సంస్థల లాభాల్లో ఒక శాతం ఇక్కడి రక్షణ, అభివృద్ధికి వెచ్చిస్తే, ఈ ప్రాంత ప్రజల్లో ధైర్యం, సంతృప్తి ఉంటుందని వివరించారు. చమురు సంస్థల రిగ్‌లు, బావుల సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు.. ఎప్పుడు, ఏ బ్లోఅవుట్ సంభవిస్తుందోనని కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారని చెప్పారు. రక్షణపరంగా సాంకేతిక జాగ్రత్తలు తీసుకోకుండా కార్యకలాపాలు చేస్తే, ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ కూడా ప్రజలతో మమేకమై, ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.
Advertisement
Advertisement