ముంబై: వీలైతే వీధి చివర్లో ఉన్న రిటైల్ దుకాణాల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసుకునే అవకాశం త్వరలోనే రానుంది.! ఎందుకంటే ఆయిల్ కంపెనీలు కాని ఇతర సంస్థలను కూడా ఇంధనాల రిటైల్ విక్రయంలోకి అనుమతించే ప్రతిపాదనపై ప్రజల నుంచి అభిప్రాయాలకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తాజాగా ఆహ్వానం పలికింది. రెండు వారాల పాటు ప్రజాభిప్రాయాలను సేకరించాక తుది నిర్ణయం తీసుకోనుంది.
ఇప్పటి వరకు ఇంధనాల రిటైల్‌లోకి అడుగుపెట్టాలంటే... సొంత రిఫైనరీలతోపాటు కనీసం రూ.2,000 కోట్ల పెట్టుబడులు ఉండాలని లేదా అన్వేషణా ఉత్పత్తి సంస్థ అయితే ఏటా మూడు మిలియన్ టన్నుల చమురు ఉత్పత్తి అయినా కలిగి ఉండాలనే నిబంధన ఉంది. ఇది చాలా సంస్థల ప్రవేశాలకు అడ్డుగా ఉంది. అయితే, ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తన నివేదికలో ఈ నిబంధనను రద్దు చేయాలని సూచించడం గమనార్హం. మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణలను ఎత్తివేశాక కూడా దేశ, విదేశీ ఆయిల్ కంపెనీలు రిటైల్ అవుట్‌లెట్ల విస్తరణపై అనుకున్నదాని కంటే తక్కువే ఆసక్తి చూపించడంతో ఇతర సంస్థలనూ అనుమతించడంపై కేంద్రం ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఇక ప్రభుత్వరంగ చమురు సంస్థల మధ్య ధరల పరంగా పోటీ కూడా లేని పరిస్థితే కొనసాగుతోంది.
ఇతర కంపెనీలకూ చోటు
‘‘ఆయిల్ అండ్ గ్యాస్ విభాగంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసిన లేదా పెట్టుబడులకు ప్రతిపాదించిన కంపెనీలకే ఇంధనాల మార్కెటింగ్ హక్కులు కల్పించడం అన్నది ప్రోత్సాహకంగా అనిపించడం లేదు. కనుక ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలకే మార్కెటింగ్ అధికారం కొనసాగించడం అనేది పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టలేని కంపెనీలు ఈ విభాగంలో పాల్గొనకుండా చేయడమే అవుతుంది. కాకపోతే మరింత కస్టమర్ అనుకూల మార్కెట్‌గా మార్చేందుకు భిన్నమైన ఆఫర్లు చేయవచ్చు’’ అని నిపుణుల కమిటీ తన నివేదికలో కేంద్రానికి సూచించడం గమనార్హం. 2019 ఏప్రిల్ 1 నాటికి దేశవ్యాప్తంగా 64,624 ఇంధన రిటైల్ అవుట్‌లెట్లు ఉన్నాయి. ఇందులో 57,944 రిటైల్ అవుట్‌లెట్లు ప్రభుత్వఆయిల్ మార్కెటింగ్ కంపెనీలవి. ఎంఆర్‌పీఎల్ నిర్వహణలో 7, రిలయన్స్, నయారా ఎనర్జీ, షెల్ ఇండియా నిర్వహణలో 6,673 ఉన్నాయి.
కంపెనీల అర్హతలు..
ఈ రంగంలోకి చాలా కంపెనీలకు ద్వారాలు తెరిచినట్టవుతుందని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఇప్పటికే టోరెంట్, టోటల్, ట్రాఫిగ్‌రా ఆసక్తి చూపినట్టు తెలిపారు. నూతన విధానంలో భాగంగా ఇంధన రిటైల్‌లోకి ప్రవేశించే ఏ కంపెనీ అయినా ఆయిల్ రిఫైనరీ సంస్థతో ఒప్పందం చేసుకుని తమ బ్రాండ్ కింద విక్రయాలు చేసుకోవచ్చని ఆ అధికారి తెలిపారు. అయితే, రాత్రికి రాత్రి ఎవరు పడితే వారు ఇందులోకి అడుగుపెట్టకుండా, కనీసం రూ.250 కోట్ల నెట్‌వర్త్ ఉన్న కంపెనీలనే ఇంధన రిటైల్‌లోకి అనుమతించే అవకాశం ఉందని చెప్పారాయన.
‘‘పైగా 5 శాతం రిటైల్ విక్రయ శాలలను గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ఆసక్తి లేకపోతే అప్‌ఫ్రంట్ ఫీజు కింద ఒక్కో రిటైల్ అవుట్‌లెట్‌కు గాను రూ.2 కోట్లు చెల్లించడం లేదా రూ.3 కోట్లకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే, కార్యకలాపాలు ఆరంభించిన తర్వాత తదుపరి ఏడేళ్ల కాలంలో ఏటా ఎన్ని విక్రయ శాలలు ఏర్పాటు చేస్తారనే ప్రణాళికలను కూడా సమర్పించాలి. ఈ లక్ష్యంలో వెనుకబడితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది’’ అని ఆ అధికారి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment