పెట్రోల్ ధర రూ.6 పెరిగినా...
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు రెండు నెలల కాలంలో రూ.6.6 మేర పెరిగినప్పటికీ, రోజువారీ ధరల సమీక్ష విధానాన్నే కొనసాగిస్తామని చమురు శాఖామంత్రి ధర్మేంద ప్రధాన్ అన్నారు. రోజువారీ విధానంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు తగ్గితే వెనువెంటనే ఆ ప్రయోజనాలను వాహనాదారులకు చేరవేయవచ్చని చెప్పారు. నిన్న జరిగిన కేబినెట్ పునర్వ్యస్థీకరణలో పెట్రోల్, నేచుర్ గ్యాస్‌కు సహాయమంత్రిగా ఉన్న ప్రధాన్ కేబినెట్ మంత్రి హోదాను దక్కించుకున్నారు. అంతేకాక అదనంగా స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రీన్యూర్షిప్కు కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. '' ఇది వినియోగదారుల ఆసక్తి మేరకు తీసుకున్న నిర్ణయం. దీనిలో మార్పులు చేయాల్సినవసరం లేదనుకుంటున్నా'' అని తెలిపారు.
15 ఏళ్ల విధానానికి స్వస్తి చెప్పిన ప్రభుత్వ రంగ ఇంధన కంపెనీలు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించడం ప్రారంభించాయి. అంతర్జాతీయ ధరలకనుగుణంగా ఈ మార్పులు చేపడుతున్నాయి. రోజువారీ ధరల విధానం వచ్చినప్పటి నుంచి ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.6.6 మేర పెరిగింది. 2014 ఆగస్టు నుంచి ఇదే అత్యధిక స్థాయి. డీజిల్ ధర కూడా రూ.4.02మేర ఎగిసింది. రోజువారీ ధరలు సమీక్షించడం మంచి పద్ధతి అని, అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు తగ్గితే 15 రోజుల పాటు ఆగకుండా వెనువెంటనే ఆ ప్రయోజనాలను వినియోగదారులకు చేరవేయవచ్చని మంత్రి తెలిపారు. ఇటీవల గ్లోబల్‌గా ధరలు పెరగడంతోనే, ఇక్కడ కూడా ధరలు పెరుగుతున్నాయన్నారు. ఒకేసారి రూ.2.50 లేదా రూ.3 మేర పెట్రోల్ ధరలు పెంచడం కంటే, ఇలా చిన్నచిన్న మొత్తాల్లో ధరలు పెంచడమే మేలని పేర్కొన్నారు.