కల్తీ ఆయిల్ గుట్టు రట్టు
ఆదిబట్ల/ఇబ్రహీంపట్నం: కల్తీ ఆయిల్ తయారీ గుట్టును అధికారులు రట్టుచేశారు. వాహనాల్లో వినియోగించిన ఆయిల్ తీసుకొచ్చి రీసైక్లింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్న ఓ కంపెనీపై ఎస్ఓటీ అధికారులు దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఇఫ్తికార్ అహ్మద్ కథనం ప్రకారం.. హయత్‌నగర్ మండలానికి చెందిన నాగిరెడ్డి, వెంకట్రావులు రాందాస్‌పల్లి శివారులో నాలుగేళ్లుగా ఓ పాత పౌల్రీ ఫామ్‌లో వివిధ ప్రాంతాల నుంచి వినియోగించిన ఆయిల్‌ను తీసుకొచ్చి గుట్టుగా రీసైక్లింగ్ చేస్తున్నారు.
అనంతరం నగరంలోని బేగంబజార్ మార్కెట్లో ఆయిల్‌ను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు శనివారం రాత్రి 11 గంటల సమయంలో కంపెనీపై దాడులు నిర్వహించారు. నిర్వాహకులు నాగిరెడ్డి, వెంకట్రావులను అరెస్టు చేవారు. వినియోగించిన పాత ఆయిల్ డ్రమ్ములు 31, రీసైక్లింగ్ చేసి తయారు చేసిన 12 ఆయిల్ డ్రమ్ములతో పాటు రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు అధికారులు కేసును ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.