Oil sector
-
రెండేళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు
న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ఇంధనశాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ చెప్పారు. వంటగదిలో మహిళలు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం తెచ్చిందని, దాని కిందే వీటిని ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇటీవల ప్రవేశ పెట్టిన 2021–22 బడ్జెట్లోనూ ఆర్థిక మంత్రి దీని ప్రస్తావన తీసుకొచ్చారు. రెండేళ్లలో కోటి కనెక్షన్లు ఇస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీనిపై తరుణ్ స్పందిస్తూ.. ఒక్కో కనెక్షన్‌కు ఖర్చయ్యే రూ. 1,600లను సబ్సీడీ ద్వారా పూడ్చుకోవచ్చని, బడ్జెట్లో కేటాయించకపోయాన ఫరవాలేదని అన్నారు. కనెక్షన్లు ఇచ్చేందుకు ఉన్న నిబంధనలను సులభతరం చేసినట్లు చెప్పారు. అంతేగాక గ్యాస్ అయిపోయాక దగ్గర్లోనే ఉన్న డీలర్లను సంప్రదించి, నింపుకునేలా మూడు డీలర్లతో ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలిపారు. గత నాలుగేళ్లలో 8 కోట్ల ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. తరచుగా ఊర్లు మారే వారికి కూడా ఎల్పీజీ కనెక్షన్లు దొరికేలా నిబంధనలు సరళతరం చేయాల్సిందిగా ఆయిల్ కంపెనీలను కోరినట్లు తెలిపారు. దీని కోసం మూడు కంపెనీలతో కలసి ఓ ఐటీ బేస్డ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చదవండి: మొత్తంగా మూడు సార్లు పెరిగిన సిలిండర్ ధర -
ఫ్లాట్‌గా మార్కెట్లు: లాభాల్లో ఆయిల్ షేర్లు
సాక్షి, ముంబై: అంచనాల కనుగుణంగానే దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. కర్ణాటక అసెంబ్లీ ఫలితాలపై దృష్టి పెట్టిన దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 39 పాయింట్ల లాభంతో 35,575 వద్ద,నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 10,818 వద్ద కొనసాగుతున్నాయి.. నిఫ్టీ 10800 స్థాయికిపైన కొనసాగుతోంది. ప్రధానంగా ఫార్మా లాభపడుతుండగా మెటల్ నష్టపోతోంది. ముఖ్యంగా చమురు ధరలు పెరగడంతో హెచ్‌పీసీఎల్, ఐవోసీ టాప్విన్నర్స్గా ఉన్నాయి. అలాగే బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, లుపిన్, అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్ లాభాల్లోనూ, ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, హిందాల్కో, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, వేదాంతా నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. అటు బులియన్ మార్కెట్లో పుత్తడి సానుకూలంగా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రా. 170 రూపాయలు పుంజుకున్న బంగారం 31,535 వద్ద ఉంది. కరెన్సీ మార్కెట్లో డాలరు మారకంలో 0.09 పైసలు లాభపడిన రూపాయి 67.23 వద్ద ఉంది. -
ఫెడ్ వడ్డనతో కుదేలైన చమురు రంగం
హైదరాబాద్: అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు ప్రభావం చమురు రంగంపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. ఫెడ్ వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచినా, చమురు ధరలను బాగానే ప్రభావితం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తీవ్రంగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ పుంజుకోవడంతో.. చమురు ధరలు ఏడేళ్ళ కనిష్టానికి క్షీణించాయి. బ్యారెల్ ముడి చమురు ధర ప్రస్తుతం 35 డాలర్లకు చేరింది. ఫెడ్ రేట్లలో ఎంతో కొంత పెంపు తప్పనిసరిగా ఉంటుందని ప్రపంచ ఆర్థిక నిపుణులు ముందే అంచనాలు వేశారు. ప్రస్తుత ఫెడ్ నిర్ణయంతో ఇప్పటికే గాడితప్పిన చమురు రంగం మాత్రం ఒక్కసారిగా కుదేలైంది. ఓపెక్ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకునే దేశాలకు ఫెడ్ నిర్ణయం సానుకూలమైనా, ధరల తగ్గుదల ఎగుమతి దేశాల మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రపంచ మార్కెట్లపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంది. కనిష్టంగా 0 శాతం గరిష్ఠంగా 0.25 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను కనిష్ఠంగా 0.25, గరిష్టంగా 0.5 శాతానికి పెంచుతూ అమెరిడా ఫెడరల్ బ్యాంకు బుధవారం రాత్రి ప్రకటించింది. 2006 జూన్ తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇదే ప్రథమం. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్ఠ స్థితిలోనే ఉందని భావించిన ఫెడ్.. వడ్డీ రేట్లను పెంచటం ద్వారా మరింత ఆర్థిక పుష్ఠికి బాటలు వేయాలని భావిస్తోంది. రానున్న కాలంలో మరిన్ని సార్లు వడ్డీ రేట్లను పెంచనున్నట్లు కూడా ఫెడరల్ బ్యాంక్ ప్రకటించింది. -
ఆరు వారాల కనిష్టం
229 పాయింట్లు నష్టం 27,602 వద్దకు సెన్సెక్స్ 8,300 దిగువకు నిఫ్టీ ఆయిల్ రంగం డీలా మూడు రోజుల వరుస నష్టాల తరువాత బుధవారం స్వల్పంగా కోలుకున్న మార్కెట్ గురువారం మళ్లీ పతనబాట పట్టింది. సెన్సెక్స్ 229 పాయింట్లు క్షీణించి 27,602కు చేరింది. నిఫ్టీ కూడా 63 పాయింట్లు పతనమై 8,300 కీలకస్థాయికి దిగువన 8,293 వద్ద నిలిచింది. ఇది ఆరు వారాల కనిష్టంకాగా, ప్రధానంగా బీఎస్ఈలో ఆయిల్ రంగం 2.5% క్షీణించడంతో మార్కెట్ కుదేలయ్యింది. ఈ బాటలో రియల్టీ, ఐటీ , పవర్, ఆటో రంగాలు సైతం 2-1% మధ్య నీరసించాయి. బుధవారం అమెరికా మార్కెట్లు నష్టపోవడం, తాజాగా బలహీనపడ్డ ఆసియా మార్కెట్లు, డాలరుతో మారకంలో రూపాయి 9 నెలల కనిష్టం 62.30కు దిగజారడం వంటి అంశాలు సెంటిమెంట్‌ను దెబ్బకొట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. చమురు ఎఫెక్ట్ : విదేశీ మార్కెట్లలో చమురు ధరలు ఐదేళ్ల కనిష్టానికి(బ్యారల్ 64 డాలర్లు) పతనమైన నేపథ్యంలో ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి సంస్థలు ఓఎన్జీసీ, ఆర్ఐఎల్, గెయిల్, కెయిర్న్ ఇండియా 3-2% మధ్య పతనమయ్యాయి. మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, టాటా పవర్, ఇన్ఫోసిస్ సైతం 3-2% మధ్య నష్టపోయాయి. అయితే బ్లూచిప్స్‌లో కోల్ ఇండియా, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ మాత్రమే 1% స్థాయిలో నిలదొక్కుకున్నాయి. ఇక రియల్టీ షేర్లు హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్, డీబీ, డీఎల్ఎఫ్, యూనిటెక్ 6-2% మధ్య జారుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,745 నష్టపోతే, 1,139 మాత్రమే లాభపడ్డాయి.