ఆరు వారాల కనిష్టం
229 పాయింట్లు నష్టం
27,602 వద్దకు సెన్సెక్స్
8,300 దిగువకు నిఫ్టీ
ఆయిల్ రంగం డీలా
మూడు రోజుల వరుస నష్టాల తరువాత బుధవారం స్వల్పంగా కోలుకున్న మార్కెట్ గురువారం మళ్లీ పతనబాట పట్టింది. సెన్సెక్స్ 229 పాయింట్లు క్షీణించి 27,602కు చేరింది. నిఫ్టీ కూడా 63 పాయింట్లు పతనమై 8,300 కీలకస్థాయికి దిగువన 8,293 వద్ద నిలిచింది. ఇది ఆరు వారాల కనిష్టంకాగా, ప్రధానంగా బీఎస్‌ఈలో ఆయిల్ రంగం 2.5% క్షీణించడంతో మార్కెట్ కుదేలయ్యింది. ఈ బాటలో రియల్టీ, ఐటీ , పవర్, ఆటో రంగాలు సైతం 2-1% మధ్య నీరసించాయి. బుధవారం అమెరికా మార్కెట్లు నష్టపోవడం, తాజాగా బలహీనపడ్డ ఆసియా మార్కెట్లు, డాలరుతో మారకంలో రూపాయి 9 నెలల కనిష్టం 62.30కు దిగజారడం వంటి అంశాలు సెంటిమెంట్‌ను దెబ్బకొట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు.
చమురు ఎఫెక్ట్ : విదేశీ మార్కెట్లలో చమురు ధరలు ఐదేళ్ల కనిష్టానికి(బ్యారల్ 64 డాలర్లు) పతనమైన నేపథ్యంలో ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి సంస్థలు ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్, గెయిల్, కెయిర్న్ ఇండియా 3-2% మధ్య పతనమయ్యాయి. మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, టాటా పవర్, ఇన్ఫోసిస్ సైతం 3-2% మధ్య నష్టపోయాయి. అయితే బ్లూచిప్స్‌లో కోల్ ఇండియా, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ మాత్రమే 1% స్థాయిలో నిలదొక్కుకున్నాయి. ఇక రియల్టీ షేర్లు హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్, డీబీ, డీఎల్‌ఎఫ్, యూనిటెక్ 6-2% మధ్య జారుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,745 నష్టపోతే, 1,139 మాత్రమే లాభపడ్డాయి.