నూనె గింజల ఉత్పత్తికి ప్రోత్సాహం
ఉండి : నూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్టు కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, హెడ్ డాక్టర్ దెబోరా మెస్సియానా తెలిపారు. ఎన్నార్పీ అగ్రహారం కృషి విజ్ఞాన కేంద్రంలో చింలపూడి, విజయరాయి గ్రామాల రైతులకు శుక్రవారం నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్‌పామ్ కార్యక్రమం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అతారీ జోన్ 5 ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో దెబోరా మాట్లాడుతూ దేశంలో నూనె గింజల ఉత్పత్తి తగ్గడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సబ్సిడీపై విత్తనాలు, పురుగుమందులు అందించి వేరుశనగ, మినుము, నువ్వుల పంటల సాగు చేసేలా కేవీకే ఆధ్వర్యంలో రైతులను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. వేరుశనగ విత్తనశుద్ధి తప్పనిసరన్నారు. శుద్ధిచేసే సమయంలో విత్తనం పైపొర పాడవకుండా చూడాలని సూచించారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. కలుపు, వేరు పురుగు, వైరస్ నివారణకు ఎకరాకు బోరెక్స్ అనే మందును ఎకరాకు 4 కేజీల చొప్పున విత్తనాలతో కలిపి భూమిలో వేయాలని సూచించారు. కార్యక్రమంలో 25 మంది రైతులు, శాస్త్రవేత్తలు ఎం.వి.కృష్ణాజీ, సుధాజాకబ్, సుమన్‌బాబు పాల్గొన్నారు.