సబ్సిడీపై ఆయిల్ ఇంజిన్లు
-జేడీఏ ఉమామహేశ్వరమ్మ
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ ఆహార భద్రత పథకం కింద సబ్సిడీపై అయిల్ ఇంజిన్లు పంపిణీ చేయనున్నట్లుగా జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఇది వరకు 483 ఆయిల్ ఇంజిన్లు జిల్లాకు కేటాయించారని, ఇవి సరిపోనందున అదనంగా 1552 మంజూరు అయ్యాయన్నారు. అపరాలు సాగు చేసిన రైతులకు మాత్రమే వీటిని పంపణీ చేస్తామన్నారు. పాంపాండ్లు తవ్వుకున్న రైతులకు ప్రాధాన్యం ఇస్తామని వివరించారు. సబ్సిడీ రూ.10వేలు లేదా 50శాతం ఇందులో ఏది తక్కువ అయితే దానిని ఇస్తామని తెలిపారు. సబ్సిడీపై శనగ విత్తనాలు పొందిన రైతులు విధిగా పంట సాగు చేసుకోవాలని అలా కాకుండా వాటిని అమ్ముకొని వేరే పంట సాగు చేస్తే వచ్చే ఏడాది సబ్సిడీ విత్తనాలు పొందడానికి అనర్హులుగా ప్రకటిస్తామని తెలిపారు. అంతేకాకుండా సబ్సిడీని రికవరీ కూడా చేస్తామని స్పష్టం చేశారు. రైతులు విత్తనాలు అమ్ముకున్న ఘటనలపై ఇప్పటికే ఉయ్యలవాడ మండలంలో కేసులు నమోదయ్యాయని వివరించారు. ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల సబ్ డివిజన్లలో మినహా మిగిలిన అన్ని మండలాల్లో విత్తనాల పంపిణీ పూర్తి అయిందని తెలిపారు.