బస్తా డబ్బులు ముక్కలుముక్కలు చేసి..
ముంబయి: పెద్ద నోట్ల రద్దు గడువు దగ్గరికి రావడం తమ దగ్గర ఉన్న కట్టలకట్టల నల్లధనం మార్చుకునేందుకు వీలు లేకపోతుండటంతో పాత రూ.500, రూ.1000 నోట్లకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ముక్కలుముక్కలు చేసి మురికి కాలువల్లో చెత్తకుప్పల్లో వేస్తున్నారు. అది ఒకటో రెండో కాదు దాదాపు ఒక బస్తా డబ్బులు. ఈ ఘటన ముంబయిలోని చార్కాప్ ప్రాంతంలో చోటు చేసుకుంది. కొంతమంది వ్యక్తుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా కనీసం ఒక బస్తాకు సరిపోయే డబ్బులు అక్కడే ఉన్న డ్రైనేజీ పక్కన పడి ఉన్నాయి. వీటిలో కొన్ని ముక్కలుమక్కలుగా చేసినవి ఉండగా ఇంకొన్ని చింపేసినవి ఉన్నాయి.
దీనిపై పోలీసులు స్పందిస్తూ ప్రస్తుతం నల్లధనం మార్చలేని పరిస్థితి ఉండటం, పెద్ద మొత్తాల్లో బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నా ఇప్పటి వరకు చేయకపోవడానికి కారణాలు చెప్పడం, డబ్బు వివరాలు అందించడం నల్ల కుభేరులకు కష్టంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది వేరే మార్గాలు అనుసరిస్తూ అక్రమ మార్గాల్లో నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకునే ప్రయత్నం చేస్తుండగా అది వీలుపడని వ్యక్తులు మాత్రం ఇలా దిక్కుతోచక చింపేస్తూ ముక్కలు చేస్తూ పడవేస్తున్నారని అన్నారు. ఏదో కటింగ్ మెషిన్ సహాయంతో ఆ డబ్బు కత్తిరించి ఉంటారని, ఈ చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, వాటి ఆధారంగా ఎవరు ఈ పనిచేసి ఉంటారో తెలుసుకుంటామని చెప్పారు.