old currancy
-
రూ.99 లక్షల పాత కరెన్సీ పట్టివేత
మార్పిడికి యత్నిస్తున్న ఐదుగురు అరెస్టు సాక్షి, హైదరాబాద్: పాత కరెన్సీ మార్పిడిపై కొందరిలో ఇంకా ఆశలు చావలేదు. తాజాగా సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ‘మార్పిడిగాళ్ల’ను ఐదుగురిని పట్టుకు న్నారు. వీరి నుంచి రూ.99 లక్షల పాత రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ బి.లింబా రెడ్డి ఆదివారం వెల్లడించారు. ఈ ముఠాకు ఓ బీటెక్ విద్యార్థి సూత్రధారి అని తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్ చర్చ్కాలనీకి చెందిన వి.సాయికుమార్‌రెడ్డి ఇబ్రహీం పట్నంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నా డు. నెల్లూరు నుంచి వలస వచ్చి మియాపూర్‌లో ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్న టి.సాయి ఇతడికి స్నేహితుడు. డిమానిటైజేషన్ నేపథ్యంలో వీరిద్దరూ కలసి పాత కరెన్సీని కమీషన్ పద్ధతిలో మారిస్తే లాభం ఉంటుందని నిర్ణయించుకున్నారు. తమకు పరిచయస్తుడైన ప్రవీణ్ నుంచి 2 రోజుల క్రితం రూ.99 లక్షల పాత కరెన్సీ తీసుకున్నారు. దీన్ని మార్పిడి చేయడానికి సహకరించా ల్సిందిగా గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన రియల్టర్ టి.ప్రసాద్‌ను కోరారు. అలా చేస్తే 5% కమీషన్‌గా ఇస్తామన్నారు. దీంతో ప్రసాద్ తన స్నేహితులైన జనగాం వాసి బి.నాగేందర్, కొత్తపేటకు చెందిన పి.రాంబాబును సంప్రదించారు. కరెన్సీని మార్చేందుకు ఒప్పుకున్నారు. దీంతో వీరంతా శనివారం సాయంత్రం సంజీవయ్య పార్క్ వద్దకు నగదుతో సహా చేరుకున్నారు. వీరి సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయి ని శ్రీనివాసరావు వలపన్ని వీరిని అరెస్టు చేశారు. -
కట్టల పాముల కలకలం
– పాత నోట్లు రద్దై 9 నెలలు గడస్తున్నా నేటికీ చలామణి – 15 రోజుల వ్యవధిలో రూ. 2కోట్లకు పైగా పట్టుకున్న పోలీసులు – రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో పాతనోట్లు పట్టివేత కరువు జిల్లా ‘అనంత’లో ‘నోట్ల కట్టల’ పాములు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లాలో మాత్రమే పెద్ద ఎత్తున పాతనోట్లు పట్టుబడుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో రూ. 2 కోట్లు పాతకరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాత కరెన్సీ రద్దు చేసి దాదాపు 9 నెలలు కావస్తోంది. మరి ఈ పాత కరెన్సీ ఎక్కడ నుంచి వస్తోంది? ఇన్ని రోజుల పాటు ఎందుకు నిల్వ చేసుకున్నారు.? పాత కరెన్సీ మార్పిడి ముఠా జిల్లా ఉందా? ఉంటే వారు ఎక్కడ మార్పిడి చేస్తున్నారు? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి. అనంతపురం సెంట్రల్: నవంబర్‌లో అప్పటి వరకు చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను కేంద్రం రద్దు చేసింది. వాటి స్థానంలో రూ.500, రూ.2వేల కొత్త కరెన్సీని విడుదల చేసింది. పాతనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసి.. కొత్త కరెన్సీని మార్చుకున్నారు. అందరూ కొత్తనోట్లకు అలవాటుపడుతున్నారు. అయితే ఇటీవల పెద్ద ఎత్తున పాతనోట్లు పట్టుబడుతున్నాయి. శనివారం వైఎస్సార్ జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నిందితులు గుంతకల్లుకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా రూ. కోటి నగదును మార్పిడి చేసేందుకు యత్నిస్తుండగా అనంతపురం త్రీటౌన్ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ నెల 13న పెద్దవడుగూరు మండలం చిన్నవడుగూరు చెందిన ఓ నిందితుడు మరో 10 మందితో కలిసి రూ. కోటి పాతకరెన్సీని మార్పిడి చేసేందుకు బెంగుళూరుకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలో పాత నోట్ల మార్పిడి ముఠా? వరుసగా బయటపడుతున్న ఇలాంటి ఘటనలను బట్టి చూస్తే జిల్లాలో పాతనోట్లు మార్పిడి ముఠా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం పట్టుబడిన నిందితుల్లో గుంతకల్లు చెందిన బాషా పాతనోట్ల మార్పిడి విషయంలో సిద్ధహస్తుడుగా పేరొందినట్లు సమాచారం. దీంతో వైఎస్సార్ జిల్లాకు చెందిన కీలక నిందితుడు కమీషన్ పద్ధతిలో పాత నోట్లు మార్పిడి చేయాలని యత్నిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే జిల్లా కేంద్రంలో పాత నోట్ల మార్పిడి ముఠా పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. బెంగూళూరులో ఈ తరహా ముఠా సభ్యులు ఉన్నట్లు, వారి ద్వారా ఎన్ఆర్ఐల కోటాలో పాత నోట్లను మార్పిడి చేయిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 50 శాతం కమీషన్‌పై పాతనోట్లను మార్పిడి చేసుకుంటున్నట్లు సమాచారం. డిమాండ్ బట్టి రూ. కోటి పాత నోట్లకు రూ. 25 లక్షలు కొత్త కరెన్సీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక సరిహద్దులో ఉండడంతోనే సమస్య జిల్లాలో పాతనోట్లు మార్పిడి చేస్తామని కొంతమంది బ్రోకర్లు, ఏజెంట్లు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. మన జిల్లా కర్ణాటక సరిహద్దులో ఉండడంతో బెంగుళూరు నుంచి కొంతమంది వస్తున్నట్లు సమాచారం. ఇటీవల రెండు ఘటనలో కీలక నిందితులు పట్టుబడాల్సి ఉంది. వారు పట్టుబడితే పాతనోట్లు ఎలా మార్పిడి చేస్తున్నారనే అంశం బయటపడుతుంది. పాతనోట్లు మార్పిడి చేసుకునేందుకు ఇప్పుడు ఏమాత్రం అవకాశం లేదు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతూ పట్టుబడితే ఆర్బీఐ నిబంధనల ప్రకారం నిందితులపై కఠినచర్యలు తీసుకుంటాం. - జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ -
పాత కరెన్సీ చెలామణి ముఠా అరెస్ట్
– రూ.కోటి నగదు, స్కార్పియో, ద్విచక్ర వాహనం స్వాధీనం – నిందితుల్లో ఆర్టీపీపీ ఏఈ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనంతపురం సెంట్రల్: ప్రభుత్వం రద్దు చేసిన పాతనోట్లను మార్పిడి చేసే ముఠాను త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు 11 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని వారి నుంచి రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు మొత్తం రూ. కోటి నగదుతో పాటు స్కార్పియో వాహనం, ఓ ద్విచక్ర వాహనం, 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం పోలీసు కాన్ఫరెన్స్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను అదనపు ఎస్పీ మాల్యాద్రి, డీఎస్పీ మల్లికార్జునవర్మ వివరించారు. ముఠా సభ్యుల వివరాలు కడప జిల్లా వీరపనాయనపల్లి మండల కేంద్రానికి చెందిన సొదుం పవన్‌కుమార్‌రెడ్డి, సోమ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, సొదుం రామిరెడ్డి, యల్లనూరు మండల కేంద్రానికి చెందిన దాసరి ఊత్తప్ప, పులివెందులకు చెందిన గజ్జెల మహేశ్వరరెడ్డి, కడప జిల్లా కేంద్రంలోని సాయిపేటకు చెందిన చంద్రశేఖర్, షేక్ నత్తర్‌బాషా అలియాస్ బాషా, అనంతపురం నగరం విద్యుత్‌నగర్‌కు చెందిన కుమ్మెత అంకిరెడ్డి, కక్కలపల్లికాలనీ చెందిన మేకల సత్యమయ్య, బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామానాయుడు, తాడిపత్రి పట్టణం విజయనగర్‌కాలనీకి చెందిన షేక్ అబీబ్‌లు ముఠాగా ఏర్పాడ్డారు. వీరిలో సొదుం పవన్‌కుమార్‌రెడ్డి కీలక నిందితుడు. అప్పులు తీర్చేందుకే దారితప్పాడు పవన్‌కుమార్‌రెడ్డి వ్యవసాయం, పెట్రోల్ బంకులను నిర్వహిస్తున్నాడు. పేకాట, తాగుడు తదితర వ్యవసనాలకు బానిసై అప్పులపాలయ్యాడు. ఎలాగైనా అప్పు తీర్చాలనే ఉద్దేశంతో సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో పడ్డాడు. పాత నోట్లు మార్పిడి చేసి తద్వారా వచ్చే కమీషన్ ద్వారా లబ్ధి పొందాలని భావించాడు. తన భావమరిది సోమ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, తమ్ముడు సొదుం రామిరెడ్డి, డ్రైవర్ దాసరి ఉత్తప్ప అలియాస్ బాబు, గజ్జెల మహేశ్వరరెడ్డి, పాళెంపల్లి చంద్రశేఖర్, నత్తర్‌బాషాలను చేరదీశాడు. నోట్ల మార్పిడి కోసం తనకు పరిచయమున్న బ్యాంకులు, పోస్టాఫీసు, ఫైనాన్స్ సంస్థల్లో పనిచేసే వారిని, ఎన్ఆర్ఐలను సంప్రదించాడు. ఈ క్రమంలో పరిచయస్తుడైన ముద్దనూరు రాయలసీమ థర్మల్ పవర్‌ప్లాంటులో ఏఈగా పనిచేస్తున్న రామకృష్ణారెడ్డిని సంప్రదించి కమీషన్ పద్ధతిలో మార్పిడి చేయిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన వద్ద, తన బంధువుల వద్ద రద్దు చేసిన పాత నోట్లు కోటి ఉన్నాయని, వాటిని మార్చివ్వాలని ఏఈ కోరాడు. ఇందుకు రూ. 5 లక్షలు కమీషన్ ఇచ్చేలా అంగీకారం కుదుర్చుకున్నారు. ముఠా సుభ్యుడైన నత్తర్‌బాషా ద్వారా అనంతపురంలో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుమ్మెత అంకిరెడ్డి, మేకల సత్యమయ్య, నరిశెట్టి రామానాయుడులను సంప్రదించాడు. నోట్ల మార్పిడిలో సిద్ధహస్తుడైన గుంతకల్లుకు చెందిన బాషాతో మాట్లాడారు. రూ.కోటి పాత నోట్లకు రూ.25 లక్షలు ప్రస్తుత కరెన్సీ నోట్లు ఇచ్చేలా అంగీకారం కుదుర్చుకున్నారు. తన ఏజెంట్ అయిన షేక్ అబీబ్‌ను అనంతపురానికి పంపాడు. సొదం పవన్‌కుమార్‌రెడ్డి ముఠా, అనంతపురంలోని ఇతర సభ్యులందరూ కలిసి షేక్ అబీబ్ ద్వారా రూ.కోటి పాత నోట్లు మార్పిడి చేసేందుకు సిద్ధమయ్యారు. స్థానిక శ్రీనివాసనగర్‌లో వీరంతా ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం డబ్బులు ఏఈ రామకృష్ణారెడ్డికి చెందినవేనా? ఆయనకు ఎలా వచ్చాయనే అంశంపై ఆరా తీస్తున్నట్లు ఏఎస్పీ, డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఇంకా ఇద్దరు కీలక నిందితులు పట్టుబడాల్సి ఉందన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న త్రీటౌన్ సీఐ మురళీకృష్ణ, ఎస్ఐలు జయపాల్‌రెడ్డి, క్రాంతికుమార్, నారాయణరెడ్డి, ఆర్ఎస్ఐ మహబూబ్‌బాషా, సిబ్బంది బాలకృష్ణ, బార్గవ్, బాబునాయక్, హరికృష్ణ, ప్రవీణ్, తిరుమలేశ్, ఫిరోజ్, స్పెషల్‌పార్టీ సిబ్బందిని వారు అభినందించారు. -
పాత కరెన్సీ నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్
రూ.కోటి పాత నోట్లు స్వాధీనం – 11 మంది అరెస్ట్, నిందితుల్లో ఒకరు కానిస్టేబుల్ – ముందే వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ అనంతపురం సెంట్రల్ : భారత ప్రభుత్వం రద్దు చేసిన పాత నోట్లను చెలామణి చేస్తున్న ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. 11 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.కోటి పాత కరెన్సీ, ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు, 13 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని గురువారం ముందే ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. నిందితుల వివరాలను స్థానిక పోలీసు కాన్ఫరెన్స్హాల్లో సీసీఎస్ డీఎస్పీ నాగసుబ్బన్న, అనంతపురం డీఎస్పీ మల్లికార్జనవర్మ సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముఠా సభ్యులు వివరాలు పెద్దవడుగూరు మండలం చిన్నవడుగూరు గ్రామానికి చెందిన తుత్తిరెడ్డి శర భారెడ్డి, బెంగళూరుకు చెందిన షేక్‌సాదిక్‌బాషా, తాడిపత్రి టౌన్‌కు చెందిన డాక్టర్ పందిర్లపల్లి సోమశేఖరరెడ్డి, అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన ధర్మవరం ఈశ్వరయ్య, నగరంలోని మారుతీనగర్‌కు చెందిన మునిశేషారెడ్డి, బుక్కరాయసముద్రం మండలం కొండాపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్(ప్రస్తుతం హిందూపురం వన్‌టౌన్‌లో విధులు) గుద్దిలి ఆంజనేయులు(పీసీ నెంబర్ 1565), కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన షేక్నాసర్వలి, తాడిపత్రి టౌన్‌కు చెందిన అనకల శ్రీనివాసకుమార్, కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన గంగాధర్, బెంగళూరుకు చెందిన రామేగౌడ, నగరంలో వెంకటేశ్వరనగర్‌కాలనీకి చెంది చిగిచేర్ల ఓబిలేసు ముఠాగా ఏర్పడ్డారు. ఓబిలేసు నివాసముంటున్న వెంకటేశ్వరనగర్‌లోని ఇంటిని కేంద్రంగా చేసుకొని పాత కరెన్సీ నోట్ల మార్పిడికి ప్రణాళికలు రచించారు. విషయం తెలుసుకున్న పోలీసులు 11 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నేపథ్యం ముఠాలో తుత్తిరెడ్డి శర భారెడ్డి కీలక నిందితుడు. గతంలో ఈయన కాంట్రాక్టర్‌గా పనిచేసేవాడు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న రూ. కోటి పాత కరెన్సీ ఇతనివే. ఇతని మామ కాసేపల్లి కృష్ణారెడ్డి తన భూమిని గతంలో అమ్మి ఆ డబ్బును తనవద్దే రహస్యంగా దాచుకున్నాడు. ఆయన చనిపోయాక అల్లుడైన శరభారెడ్డికి తెలిసింది. అప్పటికే పాతనోట్లు రద్దు చేశారు. ఈ పరిస్థితుల్లో తన మామ దాచిన పాత నోట్లను ఎలాగైనా మార్చుకోవాలని భావించాడు. ఎన్ఆర్ఐ కోటాలో మార్పిడి చేస్తే 80శాతం కరెన్సీ ఇప్పిస్తానని డాక్టర్ సోమశేఖరరెడ్డితో నమ్మబలకాడు. అయితే ఆయనకు చేత కాకపోవడంతో షేక్నాసర్వలీని సంప్రదించాడు. అతని నుంచి ధర్మవరం ఈశ్వరయ్య, కానిస్టేబుల్ ఆంజనేయులుకు వివరించారు. వీరంతా కలిసి బెంగళూరుకు చెందిన గార్మెంట్ పరిశ్రమ నిర్వాహకుడు షేక్ సాదిక్‌బాషాను సంప్రదించి 35శాతం కమీషన్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో 5శాతం ముఠాసభ్యులు, మిగతా 30శాతం శరబారెడ్డి తీసుకునేలా నిర్ణయించారు. ఈ క్రమంలో బెంగళూరు నుంచి షేక్‌సాదిక్‌బాషా, ఆయన డ్రైవర్ రామేగౌడ ఒక కారులో స్థానిక వెంకటేశ్వరనగర్‌లో ఉన్న చిగిచేర్ల వెంకటేశులు ఇంటికి చేరారు. తుత్తిరెడ్డి శరబారెడ్డి, పందిర్లపల్లి సోమశేఖరరెడ్డి, ధర్మవరం ఈశ్వరయ్య, మునిశేషారెడ్డి, అనకల శ్రీనివాస్‌కుమార్, గాదంశెట్టి గంగాధర్, కానిస్టేబుల్ ఆంజనేయులు కోటి రూపాయల పాత కరెన్సీ నోట్లను జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. గురువారం కరెన్సీని బెంగళూరుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నింస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బెంగళూరుకు చెందిన మరో కీలక నిందితుడు మనోహర్‌రెడ్డి పరారీలో ఉన్నారని డీఎస్పీలు వివరించారు. కానిస్టేబుల్‌పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నకలీ కరెన్సీని పట్టుకున్న డీఎస్పీలు, సీఐలు ఆంజనేయులు, ఇస్మాయిల్, సాయిప్రసాద్, ఎస్ఐలు చలపతి, కలాకర్బాబు, దాదాపీర్, హెడ్‌కానిస్టేబుల్స్ చెన్నయ్య, మహబూబ్‌బాషా, చిదంబరయ్య, నాగరాజు, కానిస్టేబుల్స్ రంజిత్, సుధాకర్, క్రిష్ణానాయక్, షాజాద్బాషా, హోంగార్డు లక్ష్మిరెడ్డిలను ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ అభినందిస్తూ రివార్డులు ప్రకటించారని వివరించారు.