రూ.99 లక్షల పాత కరెన్సీ పట్టివేత
మార్పిడికి యత్నిస్తున్న ఐదుగురు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: పాత కరెన్సీ మార్పిడిపై కొందరిలో ఇంకా ఆశలు చావలేదు. తాజాగా సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ‘మార్పిడిగాళ్ల’ను ఐదుగురిని పట్టుకు న్నారు. వీరి నుంచి రూ.99 లక్షల పాత రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ బి.లింబా రెడ్డి ఆదివారం వెల్లడించారు. ఈ ముఠాకు ఓ బీటెక్ విద్యార్థి సూత్రధారి అని తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్ చర్చ్‌కాలనీకి చెందిన వి.సాయికుమార్‌రెడ్డి ఇబ్రహీం పట్నంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నా డు. నెల్లూరు నుంచి వలస వచ్చి మియాపూర్‌లో ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్న టి.సాయి ఇతడికి స్నేహితుడు. డిమానిటైజేషన్ నేపథ్యంలో వీరిద్దరూ కలసి పాత కరెన్సీని కమీషన్ పద్ధతిలో మారిస్తే లాభం ఉంటుందని నిర్ణయించుకున్నారు.
తమకు పరిచయస్తుడైన ప్రవీణ్ నుంచి 2 రోజుల క్రితం రూ.99 లక్షల పాత కరెన్సీ తీసుకున్నారు. దీన్ని మార్పిడి చేయడానికి సహకరించా ల్సిందిగా గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన రియల్టర్ టి.ప్రసాద్‌ను కోరారు. అలా చేస్తే 5% కమీషన్‌గా ఇస్తామన్నారు. దీంతో ప్రసాద్ తన స్నేహితులైన జనగాం వాసి బి.నాగేందర్, కొత్తపేటకు చెందిన పి.రాంబాబును సంప్రదించారు. కరెన్సీని మార్చేందుకు ఒప్పుకున్నారు. దీంతో వీరంతా శనివారం సాయంత్రం సంజీవయ్య పార్క్ వద్దకు నగదుతో సహా చేరుకున్నారు. వీరి సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సాయి ని శ్రీనివాసరావు వలపన్ని వీరిని అరెస్టు చేశారు.