పాత కరెన్సీ చెలామణి ముఠా అరెస్ట్‌ | old currancy sales gang arrest | Sakshi
Sakshi News home page

పాత కరెన్సీ చెలామణి ముఠా అరెస్ట్‌

Published Sat, Jul 29 2017 10:13 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

పాత కరెన్సీ చెలామణి ముఠా అరెస్ట్‌ - Sakshi

పాత కరెన్సీ చెలామణి ముఠా అరెస్ట్‌

– రూ.కోటి నగదు, స్కార్పియో, ద్విచక్ర వాహనం స్వాధీనం
– నిందితుల్లో ఆర్టీపీపీ ఏఈ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు


అనంతపురం సెంట్రల్‌: ప్రభుత్వం రద్దు చేసిన పాతనోట్లను మార్పిడి చేసే ముఠాను త్రీటౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ ఆదేశాల మేరకు 11 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని వారి నుంచి రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు మొత్తం రూ. కోటి నగదుతో పాటు స్కార్పియో వాహనం, ఓ ద్విచక్ర వాహనం, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం పోలీసు కాన్ఫరెన్స్‌హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను అదనపు ఎస్పీ మాల్యాద్రి, డీఎస్పీ మల్లికార్జునవర్మ వివరించారు.

ముఠా సభ్యుల వివరాలు
కడప జిల్లా వీరపనాయనపల్లి మండల కేంద్రానికి చెందిన సొదుం పవన్‌కుమార్‌రెడ్డి, సోమ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, సొదుం రామిరెడ్డి, యల్లనూరు మండల కేంద్రానికి చెందిన దాసరి ఊత్తప్ప, పులివెందులకు చెందిన గజ్జెల మహేశ్వరరెడ్డి, కడప జిల్లా కేంద్రంలోని సాయిపేటకు చెందిన చంద్రశేఖర్, షేక్‌ నత్తర్‌బాషా అలియాస్‌ బాషా, అనంతపురం నగరం విద్యుత్‌నగర్‌కు చెందిన కుమ్మెత అంకిరెడ్డి, కక్కలపల్లికాలనీ చెందిన మేకల సత్యమయ్య, బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామానాయుడు, తాడిపత్రి పట్టణం విజయనగర్‌కాలనీకి చెందిన షేక్‌ అబీబ్‌లు ముఠాగా ఏర్పాడ్డారు. వీరిలో సొదుం పవన్‌కుమార్‌రెడ్డి కీలక నిందితుడు.

అప్పులు తీర్చేందుకే దారితప్పాడు
పవన్‌కుమార్‌రెడ్డి వ్యవసాయం, పెట్రోల్‌ బంకులను నిర్వహిస్తున్నాడు. పేకాట, తాగుడు తదితర వ్యవసనాలకు బానిసై అప్పులపాలయ్యాడు. ఎలాగైనా అప్పు తీర్చాలనే ఉద్దేశంతో సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో పడ్డాడు. పాత నోట్లు మార్పిడి చేసి తద్వారా వచ్చే కమీషన్‌ ద్వారా లబ్ధి పొందాలని భావించాడు. తన భావమరిది సోమ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, తమ్ముడు సొదుం రామిరెడ్డి, డ్రైవర్‌ దాసరి ఉత్తప్ప అలియాస్‌ బాబు, గజ్జెల మహేశ్వరరెడ్డి, పాళెంపల్లి చంద్రశేఖర్, నత్తర్‌బాషాలను చేరదీశాడు. నోట్ల మార్పిడి కోసం తనకు పరిచయమున్న బ్యాంకులు, పోస్టాఫీసు, ఫైనాన్స్‌ సంస్థల్లో పనిచేసే వారిని, ఎన్‌ఆర్‌ఐలను సంప్రదించాడు.

ఈ క్రమంలో పరిచయస్తుడైన ముద్దనూరు రాయలసీమ థర్మల్‌ పవర్‌ప్లాంటులో ఏఈగా పనిచేస్తున్న రామకృష్ణారెడ్డిని సంప్రదించి కమీషన్‌ పద్ధతిలో మార్పిడి చేయిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన వద్ద, తన బంధువుల వద్ద రద్దు చేసిన పాత నోట్లు కోటి ఉన్నాయని, వాటిని మార్చివ్వాలని ఏఈ కోరాడు. ఇందుకు రూ. 5 లక్షలు కమీషన్‌ ఇచ్చేలా అంగీకారం కుదుర్చుకున్నారు. ముఠా సుభ్యుడైన నత్తర్‌బాషా ద్వారా అనంతపురంలో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుమ్మెత అంకిరెడ్డి, మేకల సత్యమయ్య, నరిశెట్టి రామానాయుడులను సంప్రదించాడు. నోట్ల మార్పిడిలో సిద్ధహస్తుడైన గుంతకల్లుకు చెందిన బాషాతో మాట్లాడారు. రూ.కోటి పాత నోట్లకు రూ.25 లక్షలు ప్రస్తుత కరెన్సీ నోట్లు ఇచ్చేలా అంగీకారం కుదుర్చుకున్నారు.

తన ఏజెంట్‌ అయిన షేక్‌ అబీబ్‌ను అనంతపురానికి పంపాడు. సొదం పవన్‌కుమార్‌రెడ్డి ముఠా, అనంతపురంలోని ఇతర సభ్యులందరూ కలిసి షేక్‌ అబీబ్‌ ద్వారా రూ.కోటి పాత నోట్లు మార్పిడి చేసేందుకు సిద్ధమయ్యారు.  స్థానిక శ్రీనివాసనగర్‌లో వీరంతా ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం డబ్బులు ఏఈ రామకృష్ణారెడ్డికి చెందినవేనా? ఆయనకు ఎలా వచ్చాయనే అంశంపై ఆరా తీస్తున్నట్లు ఏఎస్పీ, డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఇంకా ఇద్దరు కీలక నిందితులు పట్టుబడాల్సి ఉందన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న త్రీటౌన్‌ సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐలు జయపాల్‌రెడ్డి, క్రాంతికుమార్, నారాయణరెడ్డి, ఆర్‌ఎస్‌ఐ మహబూబ్‌బాషా, సిబ్బంది బాలకృష్ణ, బార్గవ్, బాబునాయక్, హరికృష్ణ, ప్రవీణ్, తిరుమలేశ్, ఫిరోజ్, స్పెషల్‌పార్టీ సిబ్బందిని వారు అభినందించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement