నందివిగ్రహం చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్
పోరుమామిళ్ల: ఎక్కడెక్కడ గుప్తనిధులున్నాయో వెతుకుతూ, వాటిని వెలికితీసే కార్యక్రమంలో భాగంగానే పోరుమామిళ్ల పురాతన శివాలయంలో నందివిగ్రహం చోరీకి ప్రయత్నించారని ఎస్ఐ పెద్ద ఓబన్న పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో విగ్రహం అపహరణకు ప్రయత్నించిన దుండగులను విలేకరుల ఎదుట హాజరుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి ఆలయంలో శబ్దం వస్తోందని చుట్టుపక్కలవారు ఫోన్ చేయగా సిబ్బందితో వెళ్లి చుట్టుముట్టగా ఏడు మంది పట్టుబడ్డారన్నారు. వారిని విచారించగా శివాలయంలోని నందివిగ్రహంలో గుప్తనిధులున్నట్లు తెలిసి, తీసుకెళ్లేందుకు వచ్చినట్లు చెప్పారన్నారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేటకు చెందిన కర్నాటి రమణారెడ్డి అలియాస్ స్వామి కడపకు చెందిన సాయికృష్ణ, రాయచోటికి చెందిన చరణ్, అశ్విన్‌కుమార్, యర్రగుంట్లకు చెందిన ఆరవేటి రాజా, బేతంచర్లకు చెందిన రమేష్, చెన్నారెడ్డిపేటకు చెందిన సుబ్బారెడ్డితో కలిసి గుప్తనిధుల కోసం ప్రయత్నిస్తున్నారన్నారు.
కొన్నేళ్ల నుంచి తవ్వకాలు..
గత సంవత్సరకాలంగా జిల్లాలోని రాయచోటి, కడప ఫారెస్టు, పాలకొండ ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. రమణారెడ్డి అలియాస్ స్వామి ఉత్తరభారతదేశంలో పర్యటించి, క్షుద్ర పూజలు, అంజనం వేయడం నేర్చుకున్నాడని తెలిపారు. దాంతో భూమిలో, గుహల్లో, ఆలయాల్లో గుప్తనిధులు వెలికితీసే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పోరుమామిళ్ల శివాలయం గర్భగుడిలో 7 నెలల కిందట శ్వేతనాగు దర్శనమిచ్చినట్లు పత్రికల్లో, టీవీల్లో కథనాలు వచ్చాయని, దీన్ని చూసి అక్కడ గుప్తనిధులు ఉన్నట్లు భావించారన్నారు. పూజారికి ఆశ చూపి లోబరచుకుని, రాత్రికి రాత్రి విగ్రహం ఎత్తుకెళ్లాలని కారుతో సహా వచ్చారని తెలిపారు. అయితే పోలీసులకు సమాచారం అందడంతో వారి ఆటలు కుదరలేదని ఎస్ఐ వివరించారు.