Old university
-
'నలంద' వేడుకల్లో సుష్మా స్వరాజ్
పాట్నా: ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వ విద్యాలయాల్లో ఒకటైన నలందా విశ్వవిద్యాలయం పున ప్రారంభ వేడుకల్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం రావటం సంతోషంగా ఉందన్నారు. నలంద విశ్వవిద్యాలయం బీహార్‌లోని రాజ్‌గిర్ ప్రాంతంలో 455 ఎకరాల్లో నూతనంగా నిర్మించిన ప్రాంగణంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. విశ్వవిద్యాలయంలో చరిత్ర, పర్యావరణ అధ్యయన విభాగాలలో మొత్తం 15 మంది విద్యార్థులతో పాటు ఆరుగురు అధ్యాపకులు ఉన్నారు. విద్యార్థులలో జపాన్, భూటాన్ దేశాలకు చెందిన ఒక్కో విద్యార్థి ఉన్నారు. కాగా 2020 నాటికి విశ్వవిద్యాలయం పూర్తిగా కొత్తరూపు సంతరించుకోనుంది. బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మంజీ, బీజేపీ నేత, మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సుశీల్ కుమార్ మోడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే నలందా విశ్వవిద్యాలయం తిరిగి ప్రారంభం అయ్యేందుకు కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు మాత్రం ఆహ్వానం అందలేదు. నితీశ్‌కు ఆహ్వానం పంపలేదని విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. -
800 ఏళ్ల తర్వాత మళ్లీ ....
బీహార్ షరీఫ్:- ప్రపంచంలోనే తొట్టతొలి విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా, పలుదేశాల విద్యార్థులను ఆకర్షించిన ప్రాచీన నలందా విశ్వవిద్యాలయంలో సోమవారం మళ్లీ తరగతులు ప్రారంభమయ్యాయి. దాదాపు 800 సంవత్సరాల తర్వాత బీహార్‌లోని రాజ్‌గిరిలో పునరుద్ధరించిన విశ్వవిద్యాలయ నూతన ప్రాంగణంలో విద్యార్థుల చదువుల సందడి మొదలైంది. విశ్వవిద్యాలయంలో చరిత్ర, పర్యావరణ అధ్యయన విభాగాలలో మొత్తం 15 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారిలో 9 మంది తొలిరోజున తరగతులకు హాజరయ్యారు. విద్యార్థులలో జపాన్, భూటాన్ దేశాలకు చెందిన ఒక్కో విద్యార్థి ఉన్నారు. విద్యార్థులకు, ఆరుగురు అధ్యాపకులకు, సిబ్బందికి వైస్ చాన్సలర్ గోపా సభర్వాల్ స్వయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గోపా సభర్వాల్ మాట్లాడుతూ తొమ్మిదేళ్ల కృషితో ప్రాచీన విశ్వవిద్యాలయం తిరిగి ప్రారంభమైందని, భవిష్యత్తులో ఇది బలోపేతంకాగలదని ఆశిస్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయం మౌలిక సదుపాయాలు, అవసరాలపై సమీక్ష కోసం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ నెల 14న వర్సిటీని సందర్శిస్తారన్నారు. వివిధ కోర్సులకు 35దేశాల విద్యార్థుల నుంచి తమకు 1,400 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. సరైన ప్రచారంలేనందునే తక్కువ సంఖ్యలో విద్యార్థులు నమోదయ్యారని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. **