భారత ఒలింపిక్ సంఘంపై సస్పెన్షన్ ఎత్తివేత
భారత క్రీడాభిమానులకు పెద్ద ఊరట. రాబోయే ఒలింపిక్స్లో భారత పతాకాన్ని పట్టుకునే మన క్రీడాకారులు వెళ్లచ్చు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)పై ఉన్న సస్పెన్షన్ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఎత్తేసింది. దాంతో దాదాపు ఏడాది నుంచి ఉన్న ఇబ్బంది తొలగిపోయినట్లయింది. ఐఓఏకు కొత్తగా ఎన్నికలు నిర్వహించడంతో ఈ నిషేధాన్ని ఐఓసీ ఎత్తేసింది. ఆరోపణలున్న వారిని ఐఓఏలో ఎలా కొనసాగిస్తారంటూ 14 నెలల క్రితం ఐఓసీ మన ఒలింపిక్ సంఘంపై నిషేధం విధించింది. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ తమ్ముడు ఎన్.రామచంద్రన్ ప్రపంచ స్క్వాష్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా, ఇప్పుడు కొత్తగా కార్యవర్గాన్ని ఎన్నుకోవడంతో నిషేధాన్ని ఎత్తేసినట్లు ఐఓసీ తమకు ఫోన్ ద్వారా తెలియజేసిందని ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా తెలిపారు. ఇక్కడ కొత్తగా జరిగిన ఎన్నికలను ఐఓసీకి చెందిన ముగ్గురు పరిశీలకులు కూడా ప్రత్యక్షంగా వచ్చి చూశారు. వారు సంతృప్తి చెందడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.