ఫ్రాన్స్‌ను టర్కీ ముందే హెచ్చరించిందా!
పారిస్/ఇస్తాంబుల్: భారీ నరమేథం జరిగిన తర్వాత ఆకులు పట్టుకోవటంలో ఫ్రాన్స్ పోలీసులూ అతీతులు కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. గత శుక్రవారం పారిస్ నగరంలో చోటుచేసుకున్న ఉగ్రదాడులకు సంబంధించిన కీలక సమాచారం.. కొద్ది రోజుల ముందే తెలిసినప్పటికీ ఫ్రాన్స్ పోలీసులు అలసత్వం వహించారని వార్తలు వెలువడుతున్నాయి.
ఏడు చోట్ల జరిగిన దాడుల్లో అత్యంత పాశవికమైనదిగా భావిస్తోన్న బెతాక్లాన్ కన్సెర్ట్ సెంటర్ ఘటనలో పాల్గొన్న ఉగ్రవాది గురించి, అతడి ప్రణాళికల గురించి ఫ్రాన్స్ పోలీసులను పలుమార్లు హెచ్చరించినట్లు టర్కీ ఉన్నతాధికారులు పేర్కొనడం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోంది.
బెతాక్లాన్ హాలులో ప్రేక్షకులను ఒక్క చోటికి చేర్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఉగ్రవాది ఒమర్ ఇస్మాయిల్ మొస్తాఫియా.. 2013 నుంచి టర్కీలో అక్రమంగా నివసించాడని అధికారులు చెబుతున్నారు. ఫ్రాన్స్ జాతీయుడైన 29 ఏళ్ల ఒమర్.. 2010 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని, స్వదేశంలో ఇతడిపై అనేక కేసులు కూడా నమోదయినట్లు తెలిసింది. అయితే ఇతడి కదలికలపై గట్టి నిఘా పెట్టకపోవడంతో పారిస్ దాడుల వ్యూహరచన సులువుగా అమలుచేసే అవకాశాన్ని పోలీసులే కల్పించినట్లయింది.
'2014లో ఒకసారి, 2015 జూన్ లో మరోసారి ఒమర్ ఇస్మాయిల్ గురించిన సమాచారాన్ని ఫ్రాన్స్ పోలీసులకు అందించాం. ఇటీవలే తమ దేశానికి చెందిన నలుగురు ఉగ్రవాదుల జాబితాను ఫ్రాన్స్ అందించింది. ఆ జాబితాలో ఒమర్ పేరు లేకపోవడాన్ని బట్టి ఫ్రాన్స్ పోలీసులు మా హెచ్చరికలను పట్టించుకోలేదని అర్థమైంది. అయితే శుక్రవారం నాటి దాడుల తర్వాతే ఉగ్రవాది ఒమర్ వివరాలపై ఫ్రాన్స్ దృష్టి సారించింది' అని టర్కీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
బెతాక్లాన్ హాలులో 89 మందిని హతమార్చిన అనంతరం ఒమర్ ఇస్మాయిల్ తనను తాను పేల్చుకున్నాడు. సంఘటనా స్థలంలో తెగిపడివున్న చేతి వేలు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. అది ఒమర్ దేనని తేలటంతో అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఒమర్ వినియోగించిన కంప్యూటర్లతోపాటు ఇంటిని కూడా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
ఇదిలా ఉండగా పారిస్ ఉగ్రదాడిపై బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెర్మీ కోర్బెయిన్ భిన్నంగా స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐఎస్ఐఎస్ పై నేరుగా పోరాడేకంటే వారికి నిధులు సమకూర్చుతున్న దేశాల పనిపట్టాలన్నారు. ప్రధానంగా ధనిక దేశమైన సౌదీ అరేబియాకు ఐఎస్ కు మధ్య ఉన్న సంబంధాలపై చర్చ జరగాలన్నారు.
మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ మరిన్ని దాడులు జరిగే అవకాశాలున్నందున అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఉగ్రదాడికి ప్రణాళికలు ఫ్రాన్స్ లోనే జరిగాయన్నవాదనను కొట్టిపారేశారు. కచ్చితంగా సిరియాలోనే ప్లాన్ రూపొంది ఉంటుందని అభిప్రాయపడ్డారు. పారిస్ దాడుల నేపథ్యంలో ఆ దేశంలో మూడు నెలలపాటు ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే.