పండాకు ఎదురుదెబ్బ
పర్లాకిమిడి(ఒడిశా), న్యూస్‌లైన్: ఒడిశా మావోబడి పార్టీ (ఓఎంపీ) వ్యవస్థాపకుడు, మావోయిస్టు నేత సవ్యసాచి పండాకుమరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అనుచరులైన ముగ్గురు మహిళా మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడంతోపాటు భారీ డంప్‌ను, పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ సంఘటనకు సంబంధించి డీఐజీ (దక్షిణ రేంజ్) అమితాబ్ ఠాగూర్ అందించిన వివరాల ప్రకారం...గజపతి జిల్లా మోహనా పోలీసుస్టేషన్ పరిధిలోని ముఖి అటవీ ప్రాంతంలో ఓఎంపీ క్యాంపు నడుస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు గురువారం రాత్రి కూంబింగ్ చేపట్టి ముగ్గురు మహిళా మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వారిని నికిత మజ్జి, దండింగి అనిత, సుశాంతి మజ్జిగా గుర్తించారు. వారు సవ్యసాచి పండా ముఖ్య అనుచరులని నిర్ధారించారు. నికితపై రూ.3 లక్షలు, మిగతా ఇద్దరిపై రూ.50 వేల చొప్పున గతంలోనే ప్రభుత్వం రివార్డులు ప్రకటించింది. వారిపై రాష్ట్రంలో 40కి పైగా కేసులున్నాయని డీఐజీ తెలిపారు. విచారణలో వారిచ్చిన సమాచారం మేరకు ఒక ఏకే-47 రైఫిల్, నాలుగు ఎస్ఎల్ఆర్లు, రెండు ఇన్సాస్ రైఫిళ్లు, ఒక 9 ఎంఎం పిస్టల్, 354 రౌండ్ల తూటాలు, 13 మ్యాగజీన్లు, ఒక టిఫిన్ బాక్సు బాంబు, సెలైన్సర్ అమర్చిన జనరేటర్, 13 సెల్ఫోన్లు, రెండు కంప్యూటర్ ప్రింటర్లు, ఒక కీబోర్డుతోపాటు రూ. 10.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. మహిళా మావోయిస్టులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇటీవల గంజాం సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో పండా కుడి తొడలోకి బుల్లెట్ దిగినట్టు తెలుస్తోందని డీఐజీ తెలిపారు. ప్రస్తుతం ఆయనతో ఇద్దరు, ముగ్గురు సన్నిహితులు మాత్రమే ఉన్నారని వివరించారు.