One day salary
-
కేరళకు ఒక రోజు వేతనం
సాక్షి, హైదరాబాద్: వరదలతో అతలాకుతలమైన కేరళలో సహాయ, పునరావాస చర్యల కోసం అధికారులు, సిబ్బంది ఒక రోజు వేతనాన్ని ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా అధికారులు, ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాలు ప్రతిపాదించినట్లుగా వేతనాలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసేలా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ అధికారులు, తెలంగాణ సచివాలయ ఉద్యోగులు, రాష్ట్ర గెజిటెడ్ అధికారులు, టీచర్లు, పెన్షనర్లు, వర్కర్లు, యూనివర్సిటీల్లోని బోధన, బోధనేతర సిబ్బంది ఒక రోజు వేతనాన్ని కేరళ సీఎంఆర్ఎఫ్కు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. రిటైర్డు ఉద్యోగులు, పెన్షనర్లు రూ.200 చొప్పున, ఫ్యామిలీ పెన్షనర్లు రూ.100 చొప్పున కేరళకు వితరణ ఇచ్చినట్లు తెలిపారు. విరాళంగా ఒకరోజు వేతనం: యూఎస్పీసీ కేరళ వరద బాధితుల కోసం ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) పేర్కొంది. గురువారం ఈ మేరకు యూఎస్పీసీ ప్రతినిధులు సీహెచ్ రాములు, చావ రవి, బి.కొండల్‌రెడ్డి, మైస శ్రీనివాసులు, రఘుశంకర్‌రెడ్డి తదితరులు ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషిని కలసి అంగీకార పత్రాన్ని అందించారు. నెల వేతనం ఇచ్చిన రాగం సుజాత కేరళకు నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాతాయాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు అంగీకార పత్రాన్ని గురువారం ఎంపీ కవితకు అందించారు. ఒకరోజు వేతనం విరాళం: టీటీజేఏసీ కేరళ వరద బాధితులకు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ (టీటీజేఏసీ) కమిటీ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు నెల జీతంలో ఒక రోజు మూల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని టీటీజేఏసీ సమావేశంలో నిర్ణయించినట్లు ప్రతినిధులు సరోత్తంరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి,లక్ష్మారెడ్డి, నర్సింలు తదితరులు పేర్కొన్నారు. కాంట్రాక్టు ఎంప్లాయిస్ విరాళం కేరళకు సహాయం చేయడానికి రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ ముందుకు వచ్చింది. టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు యూనియన్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సాయిలు ఓ ప్రకటనలో తెలిపారు. పెన్షనర్ల సహాయం కేరళకు తమ వంతు సహాయం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ఒక్కొక్క పెన్షనర్ రూ.200 చొప్పున రాష్ట్రంలోని మొత్తం పెన్షనర్ల నుంచి దాదాపు రూ. 4 కోట్లను అందించనున్నట్లు సంఘం అధ్యక్షుడు సీతారామయ్య, కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. -
మిషన్ కాకతీయకు ఒకరోజు వేతనం విరాళం
హైదరాబాద్ సిటీ: చెరువుల పునరుధ్దరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు టీఎస్ఎండీసీ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళం ఇచ్చారు. సంస్థ సచివాయంలో సంస్థ ఎండీ శ్రీదేవి, భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్‌రావును కలిసి రూ.1.48లక్షల చెక్‌ను అందజేశారు. ఇక వరంగల్ జిల్లా తొర్రూరు గ్రామ సర్పంచ్ మేకం లక్ష్మీ అంజయ్య సైతం రూ.11,116లను మిషన్ కాకతీయకు విరాళంగా అందజేశారు. -
ఓ రోజు వేతనం కట్!
సాక్షి, చెన్నై:తమ ఉత్తర్వులను భేఖాతరు చేసి రోడ్డెక్కిన పౌష్టికాహార సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నిరసనకు ఫలంగా ఓ రోజు వేతనాన్ని కట్ చేసింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 68 వేల పౌష్టికాహార కేంద్రాలు, 35 వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 2.5లక్షల మంది సిబ్బంది పని చేస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఆలనా పాలనా, విద్యాబుద్ధులు నేర్పడం వీరి దినచర్య. అలాగే, ఇటీవల పౌష్టికాహార పథకం అమల్లో సరికొత్త మెనూను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటి తయారీ సిబ్బందికి కష్టతరంగా మారింది. ఖాళీలు కోకొల్లలుగా ఉండడం ప్రతి సిబ్బందికి అదనపు భారంగా మారింది. చాలీ చాలని జీతాలతో నెట్టుకొస్తున్న ఈ సిబ్బంది పలు మార్లు తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఫలితం శూన్యం. చివరకు రోడ్డెక్కేందుకు నిర్ణయించారు. పౌష్టికాహారం, అంగన్ వాడీ కేంద్రాల్లోని 40 వేల ఖాళీ పోస్టుల భర్తీ, పౌష్టికాహారం పథకం అమలుకు ప్రత్యేక శాఖ, వేతనాల పెంపు, పని భారం తగ్గింపు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పదోన్నతులు, తదితర డిమాండ్లతో ఈ నెల 11న కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి యత్నించి అరెస్టులు అయ్యారు. కక్ష సాధింపు: తమ నిరసనకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గుతుందని పౌష్టికాహార, అంగన్వాడీ కేంద్రాల్లోని సిబ్బంది ఆశాభావంతో ఎదురు చూశారు. అయితే, నిరసనకు ఫలంగా ఓ రోజు వేతనాన్ని కట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వారికి పెద్ద షాకే. ఈ నిరసనను భగ్నం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ హెచ్చరికలను బేఖాతరు చేసిన వేలాది మంది నిరసనల్లో పాల్గొన్నారు. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వం తన పనితనాన్ని రుచి చూపించే పనిలో పడింది. ఆ రోజున విధులకు గైర్హాజరైన వారందరికీ వేతనం కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, ప్రభుత్వ తీరును పౌష్టికాహార, అంగన్వాడీ సిబ్బంది సమాఖ్య తీవ్రంగా ఖండించింది. తాము నిరసనలో పాల్గొన్నా, పౌష్టికాహార పథకం అమలుకు ఎలాంటి ఆటంకాలు కలగలేదని గుర్తు చేసింది. తమ డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. -
తెలంగాణ ప్రభుత్వానికి 20 కోట్ల విరాళం!
ఒక రోజు మూల వేతనం ఇచ్చేందుకు ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం 22 సంఘాలతో జేఏసీ ఆవిర్భావం హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ఒకరోజు మూలవేతనం ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. కొత్త ప్రభుత్వానికి తమవంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. మంగళవారం హైదరాబాద్‌లో 22 ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పాటు చేసిన తెలంగాణ టీచర్స్ జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది. 1.50 లక్షల మంది ఉపాధ్యాయుల మూలవేతనంతో దాదాపు రూ.20 కోట్లకు పైగా అయ్యే ఆ మొత్తాన్ని జూన్ 2న కొత్త ప్రభుత ్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అందజేయనున్నట్లు వివరించింది. ఎమ్మెల్సీ పూల రవీందర్ ఆధ్వర్యంలో జేఏసీని ఏర్పాటు చేశారు. టీచర్స్ జేఏసీ చైర్మన్‌గా పి.వెంకట్‌రెడ్డి, సెక్రటరీ జనరల్స్‌గా భుజంగరావు, మణిపాల్‌రెడ్డి, కన్వీనర్‌గా సాయిరెడ్డి, కో-చైర్మన్లుగా యాదయ్య, అబ్దుల్లా, లక్ష్మారెడ్డి, ధమనేశ్వర్‌రావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్‌గా మల్లయ్య, దేశ్‌పాండే, నారాయణరెడ్డి, బాలపీరు, మల్లికార్జున్‌రెడ్డి, కోశాధికారిగా వాసుదేవరావులను ఎన్నుకున్నారు. తెలంగాణ ఉద్యమ ఇంక్రిమెంటు ఇస్తానని కేసీఆర్ ప్రకటించారని, అది ఇవ్వకపోయినా సంతోషమేనని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. చైర్మన్ పి.వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఉపాధ్యాయ సమస్యల జోలికి వెళ్లకుండా, విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారిస్తామన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో దాదాపు 10వేల మంది స్థానికేతరులు ఉన్నారని, ఆ లెక్కలు తీసి వారి ప్రాంతాలకు పంపించాలని డిమాండ్ చేశారు.