సాక్షి, హైదరాబాద్: వరదలతో అతలాకుతలమైన కేరళలో సహాయ, పునరావాస చర్యల కోసం అధికారులు, సిబ్బంది ఒక రోజు వేతనాన్ని ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా అధికారులు, ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాలు ప్రతిపాదించినట్లుగా వేతనాలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసేలా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఐఏఎస్ అధికారులు, తెలంగాణ సచివాలయ ఉద్యోగులు, రాష్ట్ర గెజిటెడ్ అధికారులు, టీచర్లు, పెన్షనర్లు, వర్కర్లు, యూనివర్సిటీల్లోని బోధన, బోధనేతర సిబ్బంది ఒక రోజు వేతనాన్ని కేరళ సీఎంఆర్‌ఎఫ్‌కు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. రిటైర్డు ఉద్యోగులు, పెన్షనర్లు రూ.200 చొప్పున, ఫ్యామిలీ పెన్షనర్లు రూ.100 చొప్పున కేరళకు వితరణ ఇచ్చినట్లు తెలిపారు.
విరాళంగా ఒకరోజు వేతనం: యూఎస్‌పీసీ
కేరళ వరద బాధితుల కోసం ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) పేర్కొంది. గురువారం ఈ మేరకు యూఎస్‌పీసీ ప్రతినిధులు సీహెచ్ రాములు, చావ రవి, బి.కొండల్‌రెడ్డి, మైస శ్రీనివాసులు, రఘుశంకర్‌రెడ్డి తదితరులు ప్రభుత్వ సీఎస్ ఎస్‌కే జోషిని కలసి అంగీకార పత్రాన్ని అందించారు.
నెల వేతనం ఇచ్చిన రాగం సుజాత
కేరళకు నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్ రాగం సుజాతాయాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు అంగీకార పత్రాన్ని గురువారం ఎంపీ కవితకు అందించారు.
ఒకరోజు వేతనం విరాళం: టీటీజేఏసీ
కేరళ వరద బాధితులకు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ (టీటీజేఏసీ) కమిటీ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు నెల జీతంలో ఒక రోజు మూల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని టీటీజేఏసీ సమావేశంలో నిర్ణయించినట్లు ప్రతినిధులు సరోత్తంరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి,లక్ష్మారెడ్డి, నర్సింలు తదితరులు పేర్కొన్నారు.
కాంట్రాక్టు ఎంప్లాయిస్ విరాళం
కేరళకు సహాయం చేయడానికి రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ ముందుకు వచ్చింది. టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు యూనియన్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సాయిలు ఓ ప్రకటనలో తెలిపారు.
పెన్షనర్ల సహాయం
కేరళకు తమ వంతు సహాయం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ఒక్కొక్క పెన్షనర్ రూ.200 చొప్పున రాష్ట్రంలోని మొత్తం పెన్షనర్ల నుంచి దాదాపు రూ. 4 కోట్లను అందించనున్నట్లు సంఘం అధ్యక్షుడు సీతారామయ్య, కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment