ఓ రోజు వేతనం కట్! | one day Salary cut on Nutritional staff in Chennai | Sakshi
Sakshi News home page

ఓ రోజు వేతనం కట్!

Published Fri, Aug 22 2014 12:30 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM

ఓ రోజు వేతనం కట్! - Sakshi

ఓ రోజు వేతనం కట్!

సాక్షి, చెన్నై:తమ ఉత్తర్వులను భేఖాతరు చేసి రోడ్డెక్కిన పౌష్టికాహార సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నిరసనకు ఫలంగా ఓ రోజు వేతనాన్ని కట్ చేసింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 68 వేల పౌష్టికాహార కేంద్రాలు, 35 వేల అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 2.5లక్షల మంది సిబ్బంది పని చేస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల ఆలనా పాలనా, విద్యాబుద్ధులు నేర్పడం వీరి దినచర్య. అలాగే, ఇటీవల పౌష్టికాహార పథకం అమల్లో సరికొత్త మెనూను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది.
 
 వీటి తయారీ సిబ్బందికి కష్టతరంగా మారింది. ఖాళీలు కోకొల్లలుగా ఉండడం ప్రతి సిబ్బందికి అదనపు భారంగా మారింది. చాలీ చాలని జీతాలతో నెట్టుకొస్తున్న ఈ సిబ్బంది పలు మార్లు తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఫలితం శూన్యం. చివరకు రోడ్డెక్కేందుకు నిర్ణయించారు. పౌష్టికాహారం, అంగన్ వాడీ కేంద్రాల్లోని 40 వేల ఖాళీ పోస్టుల భర్తీ, పౌష్టికాహారం పథకం అమలుకు ప్రత్యేక శాఖ, వేతనాల పెంపు, పని భారం తగ్గింపు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పదోన్నతులు, తదితర డిమాండ్లతో ఈ నెల 11న కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి యత్నించి అరెస్టులు అయ్యారు.
 
 కక్ష సాధింపు: తమ నిరసనకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గుతుందని పౌష్టికాహార, అంగన్‌వాడీ కేంద్రాల్లోని సిబ్బంది ఆశాభావంతో ఎదురు చూశారు. అయితే, నిరసనకు ఫలంగా ఓ రోజు వేతనాన్ని కట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వారికి పెద్ద షాకే. ఈ నిరసనను భగ్నం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ హెచ్చరికలను బేఖాతరు చేసిన వేలాది మంది నిరసనల్లో పాల్గొన్నారు. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వం తన పనితనాన్ని రుచి చూపించే పనిలో పడింది. ఆ రోజున విధులకు గైర్హాజరైన వారందరికీ వేతనం కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, ప్రభుత్వ తీరును పౌష్టికాహార, అంగన్‌వాడీ సిబ్బంది సమాఖ్య తీవ్రంగా ఖండించింది. తాము నిరసనలో పాల్గొన్నా, పౌష్టికాహార పథకం అమలుకు ఎలాంటి ఆటంకాలు కలగలేదని గుర్తు చేసింది. తమ డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement