పరిగిలో వంద పడకల ఆస్పత్రి
పరిగి, పరిగి రూరల్: వెనుకబడి ఉన్న పరిగిలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని రవాణా శాఖమంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆసరా పథకంలో బాగంగా నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన పరిగి సర్పంచ్ విజయమాల ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో , మండల పరిధిలోని సయ్యద్మల్కాపూర్లో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ ప్రారంభ సమావేశంలో మాట్లాడారు. పంచాయతీ శాఖ మంత్రితో మాట్లాడి పరిగి పంచాయతీ భవనానికి కోటి రూపాయలు మంజూరు చేయిస్తానన్నారు.
తెలంగాణా ఆర్టీసీని దేశంలోనే ముందు వరుసలో నిలబెడతామని తెలిపారు. రూ. 150 కోట్లతో 500 బస్సులు, ఇందులో 100 ఏసీ బస్సులు త్వరలో కొనుగోలు చేసి ఆర్టీసీకి అందిస్తామన్నారు. ఈవారంలో పరిగి డిపోకు ఐదు బస్సులు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో 1300 గ్రామాలకు రోడ్లులేని కారణంగా బస్సులు నడవడం లేదని గుర్తించామన్నారు.
ఆ గ్రామాలన్నింటికి రోడ్లు వేసి బస్సులు నడుపుతామన్నారు. ఆర్అండ్బీ రోడ్ల కోసం రూ. 10 వేల కోట్లు, పంచాయతీ రాజ్ రోడ్ల కోసం రూ.ఐదు వేలకోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఆరు నుంచి తొమ్మిది నెల ల్లో ఈ రోడ్ల పనులు పూర్తి చేస్తామన్నారు. జిల్లాకు చెందిన నాలుగు పశ్చిమ నియెజకవ ర్గాల్లో ఉద్యానవన పంటలతో పాటు పాడి, పౌల్ట్రీ పరిశ్రమలను అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో చెరువుల పునరుద్దరణ, ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు, తాగు నీరు అందిస్తామన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో పరిగి నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందన్నారు. వ్యవసాయానికి , గృహ అవసరాలకు 24 గంటల నిరంతర కరంటు ఇచ్చేవిధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు రూ. 7కోట్ల రూపాయలను పింఛన్ల కోసం వెచ్చించగా కొత్త పింఛన్లతో రూ.27 కోట్లకు పెంచామన్నారు. జిల్లాలో 2.40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. పేదలకు ఇళ్లు, ‘కళ్యాణ లక్ష్మి’ పథకాలు వెంటనే ప్రారంభమవుతాయన్నారు.