విందు భోజనం తిని 100 మందికి అస్వస్థత
చెన్నారెడ్డిపల్లి(పొదలకూరు) : విందు భోజనం ఆరగించిన వందమంది తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన మండలంలోని చెన్నారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెల్లటూరు సుబ్బయ్య మనుమరాలు పుష్పవతి కావడంతో సోమవారం రాత్రి గ్రామస్తులను ఆహ్వానించి విందు భోజనం ఏర్పాటు చేశారు. గ్రామస్తులే కాక బుచ్చి, వంగల్లు, మర్రిపాడు తదితర ప్రాంతాల నుంచి సుబ్బయ్య బంధువులు సుమారు వంద మంది హాజరయ్యారు. మంగళవారం ఉదయం 10 గంటల నుం చి విందు భోజనం ఆరగించిన ప్రతిఒక్కరికి వాంతులు, విరేచనాలు మొదలైయ్యాయి.
భీతిల్లిన గ్రామస్తులు 108 అంబులెన్స్, ఆటోల్లో పొదలకూరు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. సుబ్బయ్య సుమారు పది రకాల కూరలతో భోజనం తయారు చేయించినట్టు బాధితులు చెబుతున్నారు. బాధితుల్లో ఎంపీటీసీ సభ్యురాలు కోడూరు విజయమ్మ కూడా ఉన్నారు. పొదలకూరు ఆస్పత్రుల్లో బెడ్లు చాలకపోవడంతో కొందరు నెల్లూరుకు వెళ్లాల్సి వచ్చింది. చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాధితులే 60 మంది ఉన్నారు.
వీరిలో వరికూటి లక్ష్మమ్మ, వెల్మిరెడ్డి వెంకటరమణమ్మ, వరికూటి భాగ్యమ్మ, మూలి రుక్మిణమ్మ, మూలి పెంచలమ్మ, మూలి కొండమ్మ, కోడూరు భారతమ్మ, వెల్మిరెడ్డి కోటేశ్వరమ్మ, యనమల ధనమ్మ, కోడూరు పద్మమ్మ, నోటి ప్రమీలా, నోటి సుబ్బరత్నమ్మ, వెల్మిరెడ్డి లీలమ్మ, వరికూటి లక్ష్మమ్మ, కోడూరు సుబ్బారెడ్డి, నందిరెడ్డి నారాయణరెడ్డి, వరికూటి సరిత, వెల్మిరెడ్డి వెంకటరణమ్మ, నీలం సంపూర్ణమ్మ, కోడూరు కొండమ్మ, పలుకూరు లక్ష్మమ్మ, కోడూరు వనమ్మ, బుర్రా రమణమ్మ, కోడూరు మస్తానమ్మ, వెల్లటూరు పెంచలయ్య తదితరులున్నారు. వండిన కూరల్లో బల్లిపడినట్టు అనుమానిస్తున్నారు. పొదలకూరు డిప్యూటీ డీఎంహెచ్వో ఎస్.రాజ్యలక్ష్మీ వైద్య ఆరోగ్య సిబ్బందిని గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించారు. పొదలకూరు తహశీల్దార్ వి.కృష్ణారావు బాధితులను పరామర్శించారు.