చేతన్ భగత్ నవలపై దుమారం!
ప్రముఖ రచయిత చేతన్ భగత్ తాజా నవల ‘వన్ ఇండియన్ గర్ల్’ చుట్టు వివాదం ముసురుకుంది. ఈ నవలలో చేతన్ గ్రంథచౌర్యానికి పాల్పడ్డారని, తాను రాసిన ఓ కథను కాపీకొట్టి ఆయన నవలను రాశారని బెంగళూరుకు చెందిన రచయిత్రి కోర్టును ఆశ్రయించింది. చేతన్ నవల ’ఫైవ్ పాయింట్ సమ్వన్’ను ఢిల్లీ యూనివర్సిటీ పాఠ్యాంశంగా తీసుకున్న సమయంలో ఈ ఆరోపణలు వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాతో ఈ అంశం పెద్ద దుమారం రేపుతోంది.
చేతన్ భగత్ తన కథ ‘డ్రాయింగ్ ప్యారలల్స్’ను కాపీ కొట్టారని బెంగళూరు రచయిత్రి అన్విత బాజ్పేయి దావా వేశారు. 2014లో బెంగళూరు సాహిత్సోత్సవానికి వచ్చిన సందర్భంగా తన కథల సంకలనం ‘లైఫ్, ఆడ్స్ అండ్ ఎండ్స్’ను ఆయనకు సమీక్ష కోసం ఇచ్చానని, అందులోని కథను ఆయన గ్రంథచౌర్యం చేసి ‘వన్ ఇండియన్ గర్ల్’ నవల కోసం వాడుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు పూర్తి వివరాలతో ఆమె ఫేస్బుక్లో పెట్టిన పోస్టు ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతోంది.