33లో నాది ఒకటి
‘‘ప్రేమకథా చిత్రాలు ఎన్ని వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథలకు ఏమాత్రం భిన్నంగా ఉన్నా ఆ కథను సూపర్‌హిట్ చేసేస్తారు. అలాంటి ఓ హిట్ స్టోరీతో మేం ఈ చిత్రం చేస్తున్నాం’’ అని చెప్పారు శివగణేష్. యువన్ టూరింగ్ టాకీస్ పతాకంపై స్వీయదర్శకత్వంలో ఆయన రూపొందిస్తున్న చిత్రం ‘33 ప్రేమకథలు’. ‘అందులో నాది ఒకటి’ అనేది ఉపశీర్షిక. వివేక్, సునీత మారిష్యార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కృష్ణుడు, మురళీమోహన్, శ్రావణి, ఫణి, చంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెలాఖరున పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మాట్లాడుతూ -‘‘నిజజీవితంలో తారసపడే ప్రేమకథల్ని ఆధారంగా చేసుకుని వినోద ప్రధానంగా ఈ సినిమా చేశాం. చిన్నపాటి సందేశం కూడా ఉంటుంది. అజయ్ పట్నాయక్ ఎనిమిది పాటలకు అద్భుతమైన స్వరాలందించారు. ఆ పాటలను పదిమంది సంగీతదర్శకులతో పాడించాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జైశంకర్ యేగిరెడ్డి, సమర్పణ: జ్యోతి గణేష్.