one rupee ride
-
జయ వీరాభిమాని
ప్రమాణ స్వీకారం రోజున ఆటో చార్జి రూపాయి మాత్రమే కేకే.నగర్: ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రయాణికుల నుంచి ఒక్క రూపాయి మాత్రమే ఆటోచార్జ్ కింద వసూలు చేసి ఓ ఆటోడ్రైవర్ తన అమ్మ భక్తిని నిరూపించుకున్నాడు. కోయంబత్తూరు సింగార నల్లూర్కు చెందిన మదావానన్ (61) ఆటోడ్రైవర్. అన్నాడీఎంకే సభ్యుడు అయిన ఇతడు సోమవారం అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని తన ఆటోలో ప్రయాణించిన వారు ఎంత దూరం సవారికి వెళ్లినా ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేశారు. ‘ఒక్క రూపాయి చాలు’ అనే స్లోగన్ గల స్టిక్కర్ను ఆటోపైన అతికించారు. సోమవారం ఒకరోజు రాత్రి వరకు 200లకు పైగా ప్రయాణికులు మదివానన్ ఆటోలో ప్రయాణించారు. దీనిపై మదివానన్ మాట్లాడుతూ ‘అన్నాడీఎంకే అభ్యర్థి అయిన నేను గత 1975 నుంచి ఆటో నడుపుతున్నాను. నిజాయితీ, న్యాయమైన చార్జ్ అనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. నా పిల్లలకు వివాహాలు జరిపి వారు స్వతంత్రంగా జీవిస్తున్నారు. అందువలన నాకు ఎలాంటి బాధ్యతలు కాని ఖర్చులు కాని లేవు. అందువలన ప్రతిరోజూ సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని ప్రజా సంక్షేమాలకు ఖర్చు చేస్తున్నాను. నా సహ డ్రైవర్లు కుటుంబాల్లో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కలిగితే వారికి సహాయం చేస్తాను. ముఖ్యమంత్రి జయలలిత ప్రమాణ స్వీకారం చేసిన సంతోషంతో ప్రయాణికుల వద్ద చార్జీ కింద రూపాయి వసూలు చేసి తృప్తి పడ్డాన’ని మదివానన్ తెలిపారు. తమిళనాడులో వీరాభిమానుల జాబితాలో అమ్మ మదిలో మదివానన్ చోటు సంపాదించుకున్నాడు. -
ఒక్క రూపాయికే ఆటో ప్రయాణం!
అమ్మ పేరు చెబితే చాలు.. అక్కడ పూనకాలు వచ్చేస్తాయి. అందుకే 32 ఏళ్ల నాటి రికార్డును బద్దలుకొట్టి మరీ వరుసగా రెండోసారి ఆమెను గెలిపించారు. ఇప్పుడు జయలలిత విజయాన్ని పండగలా చేసుకుంటున్నారు ఆమె అభిమానులు. అందులో భాగంగానే.. కోయంబత్తూరుకు చెందిన జయ అభిమాని అయిన ఓ ఆటోడ్రైవర్ తన ఆటోలో ఎక్కే ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లినా వాళ్ల దగ్గర నుంచి కేవలం ఒక్క రూపాయి మాత్రమే చార్జీ తీసుకుంటున్నారు. ఒక రోజులో మొత్తం 102 మందిని తాను గమ్యాలకు చేర్చి 102 రూపాయలు సంపాదించానని, ఇందుకోసం తాను ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం మానేశానని ఆటోడ్రైవర్ ఆర్ఎం మత్తివనన్ చెప్పారు. ఉదయం 6 గంటలకు ఆటో రోడ్డుమీదకు ఎక్కితే సాయంత్రం 6 గంటలకే ఆగుతుంది. జయలలిత ఆరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంగా తాను ఆమె విజయాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నానని తెలిపారు. మత్తివనన్ 1975 నుంచి అన్నాడీఎంకే కార్యకర్తగా ఉన్నారు. గత 41 ఏళ్లుగా కోయంబత్తూరులో ఆటో నడుపుతున్నానని, ఎంజీఆర్ హయాం నుంచి పార్టీలో సభ్యుడినని అన్నారు. జయలలిత తమిళనాడు ప్రజలకు చాలా మంచి చేశారని, అందుకే ఆమెను ప్రజలు మరోసారి గెలిపించారని చెప్పారు. ఆమె అన్నా క్యాంటీన్లలో రూపాయికే ఇడ్లీలు పెడుతున్నారని, అందుకే చాలామంది పేదలు ఉదయం టిఫిన్ చేయగలుగుతున్నారని చెప్పారు. అమ్మ అంతమందికి సాయం చేస్తున్నారు కాబట్టి.. తాను తనకు తోచిన సాయం చేస్తున్నట్లు మత్తివనన్ తెలిపారు.