ఒక్క రూపాయికే ఆటో ప్రయాణం!
అమ్మ పేరు చెబితే చాలు.. అక్కడ పూనకాలు వచ్చేస్తాయి. అందుకే 32 ఏళ్ల నాటి రికార్డును బద్దలుకొట్టి మరీ వరుసగా రెండోసారి ఆమెను గెలిపించారు. ఇప్పుడు జయలలిత విజయాన్ని పండగలా చేసుకుంటున్నారు ఆమె అభిమానులు. అందులో భాగంగానే.. కోయంబత్తూరుకు చెందిన జయ అభిమాని అయిన ఓ ఆటోడ్రైవర్ తన ఆటోలో ఎక్కే ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లినా వాళ్ల దగ్గర నుంచి కేవలం ఒక్క రూపాయి మాత్రమే చార్జీ తీసుకుంటున్నారు. ఒక రోజులో మొత్తం 102 మందిని తాను గమ్యాలకు చేర్చి 102 రూపాయలు సంపాదించానని, ఇందుకోసం తాను ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం మానేశానని ఆటోడ్రైవర్ ఆర్ఎం మత్తివనన్ చెప్పారు. ఉదయం 6 గంటలకు ఆటో రోడ్డుమీదకు ఎక్కితే సాయంత్రం 6 గంటలకే ఆగుతుంది. జయలలిత ఆరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంగా తాను ఆమె విజయాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నానని తెలిపారు.
మత్తివనన్ 1975 నుంచి అన్నాడీఎంకే కార్యకర్తగా ఉన్నారు. గత 41 ఏళ్లుగా కోయంబత్తూరులో ఆటో నడుపుతున్నానని, ఎంజీఆర్ హయాం నుంచి పార్టీలో సభ్యుడినని అన్నారు. జయలలిత తమిళనాడు ప్రజలకు చాలా మంచి చేశారని, అందుకే ఆమెను ప్రజలు మరోసారి గెలిపించారని చెప్పారు. ఆమె అన్నా క్యాంటీన్లలో రూపాయికే ఇడ్లీలు పెడుతున్నారని, అందుకే చాలామంది పేదలు ఉదయం టిఫిన్ చేయగలుగుతున్నారని చెప్పారు. అమ్మ అంతమందికి సాయం చేస్తున్నారు కాబట్టి.. తాను తనకు తోచిన సాయం చేస్తున్నట్లు మత్తివనన్ తెలిపారు.