జయ వీరాభిమాని
ప్రమాణ స్వీకారం రోజున ఆటో చార్జి రూపాయి మాత్రమే
కేకే.నగర్: ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రయాణికుల నుంచి ఒక్క రూపాయి మాత్రమే ఆటోచార్జ్ కింద వసూలు చేసి ఓ ఆటోడ్రైవర్ తన అమ్మ భక్తిని నిరూపించుకున్నాడు. కోయంబత్తూరు సింగార నల్లూర్‌కు చెందిన మదావానన్ (61) ఆటోడ్రైవర్. అన్నాడీఎంకే సభ్యుడు అయిన ఇతడు సోమవారం అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని తన ఆటోలో ప్రయాణించిన వారు ఎంత దూరం సవారికి వెళ్లినా ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేశారు. ‘ఒక్క రూపాయి చాలు’ అనే స్లోగన్ గల స్టిక్కర్‌ను ఆటోపైన అతికించారు.
సోమవారం ఒకరోజు రాత్రి వరకు 200లకు పైగా ప్రయాణికులు మదివానన్ ఆటోలో ప్రయాణించారు. దీనిపై మదివానన్ మాట్లాడుతూ ‘అన్నాడీఎంకే అభ్యర్థి అయిన నేను గత 1975 నుంచి ఆటో నడుపుతున్నాను. నిజాయితీ, న్యాయమైన చార్జ్ అనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. నా పిల్లలకు వివాహాలు జరిపి వారు స్వతంత్రంగా జీవిస్తున్నారు. అందువలన నాకు ఎలాంటి బాధ్యతలు కాని ఖర్చులు కాని లేవు. అందువలన ప్రతిరోజూ సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని ప్రజా సంక్షేమాలకు ఖర్చు చేస్తున్నాను. నా సహ డ్రైవర్లు కుటుంబాల్లో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కలిగితే వారికి సహాయం చేస్తాను. ముఖ్యమంత్రి జయలలిత ప్రమాణ స్వీకారం చేసిన సంతోషంతో ప్రయాణికుల వద్ద చార్జీ కింద రూపాయి వసూలు చేసి తృప్తి పడ్డాన’ని మదివానన్ తెలిపారు. తమిళనాడులో వీరాభిమానుల జాబితాలో అమ్మ మదిలో మదివానన్ చోటు సంపాదించుకున్నాడు.