Ongole Parliament candidate
-
బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ : బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తామని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఒంగోలు క్లాత్ మార్కెట్ అసోసియేషన్ హాల్లో బుధవారం ఆంధ్రకేసరి సేవా సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. బ్రాహ్మణులకు వైఎస్సార్ ఎలా అండగా ఉన్నారో జగన్ కూడా అలాగే ఉంటారని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు వైఎస్సార్ సీపీకి మద్దతిచ్చి, పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి రాగానే పేద బ్రాహ్మణులందరికీ ఇళ్ల స్థలాలిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ హయాంలో ఈబీసీలకు ప్రాధాన్యమిచ్చిన విషయాన్ని బాలినేని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డికి, అసెంబ్లీ అభ్యర్థి అయిన తనకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. వైఎస్సార్ సీపీ బాపట్ల అసెంబ్లీ అభ్యర్థి కోన రఘుపతి మాట్లాడుతూ.. బ్రాహ్మణులకు వైఎస్సార్ ఎంతో సేవ చేశారని కొనియాడారు. బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటా శంకరశర్మ మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీలో బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. వైవీ సుబ్బారెడ్డి, బాలినేనిని గెలిపించేందుకు బ్రాహ్మణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కోటా శంకరశర్మను ఘనంగా సన్మానించారు. దక్షిణామూర్తి, గొల్లాపల్లి సుబ్బారావు తదితరులు ప్రసంగించారు. తదనంతరం బాలినేని, వైవీ సుబ్బారెడ్డిని గజమాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. బ్రాహ్మణుల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గొల్లాపల్లి సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నేలబొట్ల సదాశివయ్య, ఉదయగిరి సీతారామాచార్యులు, దక్షిణామూర్తి, చీమలమర్రి సుబ్బారావు, టీవీఎల్ సుబ్రహ్మణ్యం, ఉప్పుగుండూరి శ్రీనివాసరావు, రావిపూడి గిరిజారావు, మద్దులూరి హరిప్రేమనాథ్, జీ రంగనాథ్, ముక్తినూతలపాటి వాసు, మైనంపాటి సాయి పాల్గొన్నారు.యువ లాయర్లు ఎన్ శ్రీనివాసప్రసాద్, పీవీ రాఘవరావు, పీ రత్నాకర్, ఎం శ్రీధర్, భద్రేశ్వరరావు తదితరులు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని సమక్షంలో పార్టీలో చేరారు. -
'విజన్ ఉన్న నాయకుడు వైఎస్ జగన్'
ప్రకాశం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్దిపై స్పష్టమైన విజన్ ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పారు. జగన్ సీఎం అయితే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇళ్లులేని వారందరికీ పక్కాఇళ్ల నిర్మాణం చేపడతారని హామీయిచ్చారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే అమ్మ ఒడి పథకం, రైతులను ఆదుకునేందుకు 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారన్నారు. డ్వాక్రా మహిళల కోసం వారు తీసుకున్న రుణాలను రద్దు చేస్తారన్నారు.సంక్షేమ రాజ్యం జగన్‌తోనే సాధ్యమన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి వైఎస్సార్ సీపీని గెలిపించాలని కోరారు. -
వైఎస్ఆర్ పాలన మళ్లీ రావాలంటే.. జగన్ సీఎం కావాలి
దర్శి, న్యూస్‌లైన్ : మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రంలో పరిపాలనను ఓసారి గుర్తుచేసుకోండి.. అలాంటి రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది... అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పార్టీ దర్శి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి బుధవారం దర్శిలో భారీ ర్యాలీ నిర్వహించి అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం కనీవినీ ఎరుగని రీతిలో పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేశారని గుర్తుచేశారు. ఆయన పాలనలో అన్నిరంగాలు, అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించారన్నారు. 2009 ఎన్నికల్లో కూడా మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకున్నారని చెప్పారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆయన మరణించారని, అనంతరం రాష్ట్రంలో పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలకులు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని, వైఎస్ఆర్ పథకాలను అటకెక్కించారని, రాష్ట్రాన్ని కూడా విభజించి సీమాంధ్రులకు అన్యాయం చేశారని ఆందోళన చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులను చక్కదిద్ది మళ్లీ మహానేత సంక్షేమ పాలనను అందించగల సత్తా జగన్మోహన్రెడ్డికే ఉందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రజలు, రైతుల సంక్షేమం కోసం జగన్ చేసిన పోరాటాలు, ఇటీవల ఆయన ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలే అందుకు నిదర్శనమన్నారు. కుమ్మక్కు కుట్రలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలను తరిమికొట్టాలని, వైఎస్ఆర్ సీపీ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి జగన్‌ను సీఎం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అండగా నిలబడేది వైఎస్ఆర్ సీపీనే : బూచేపల్లి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ పేదలకు అండగా నిలబడేది వైఎస్ఆర్ సీపీ మాత్రమేనన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు..ప్రజలను కూడా మోసం చేస్తున్నారని, ఆయన్ను నమ్మవద్దని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొని ప్రసంగించారు.