సరుకులు సక్రమంగా సరఫరా చేయండి
అనంతపురం అర్బన్ : ‘‘ఇది నా సొంత జిల్లా. నేను ప్రాతినిథ్యం వహించే పౌర సరఫరాల శాఖ ద్వారా సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలి.’’ అంటూ అధికారులను పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఆదేశించారు. మంగళవారం ఆమె తన నివాసంలో జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతంతో కలిసి ఈ పాస్, ఉల్లిపాయల విక్రయం, తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, మునిసిపాలిటీల్లో ఉల్లిపాయలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జేసీని మంత్రి ఆదేశించారు. ఉల్లిపాయలు ప్రతి రోజు వంద టన్నులు కొనుగోలు చేసి జిల్లాకు పంపిస్తున్నామన్నారు.
మార్కెటింగ్ సొసైటీల ద్వారా కూడా ఉల్లిపాయల విక్రయానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. స్మార్ట్ కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డులు రూపొందించే ఆలోచన చేస్తున్నామన్నారు. సాంకేతిక సమస్య వల్ల కార్డుదారులకు రేషన్ ఇవ్వకుండా వెనక్కి పంపించకూడదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో వారికి రేషన్ ఇచ్చే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ మేనేజర్ శ్రీనివాసులు, మార్కెటింగ్ ఏడీ శ్రీకాంత్‌రెడ్డి, ఆర్డీఓ హుసేన్‌సాబ్ పాల్గొన్నారు.