నేతన్నకు ఊతం...ఆ ‘ఫేట్’బుక్
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చేనేత కార్మికుడు గుర్రం ఆంజనేయులుకు ఫేస్బుక్ కాస్తా ‘ఫేట్’బుక్‌గా మారింది. తాను నేసిన వస్త్రాలను ఫేస్బుక్ ద్వారా ప్రపంచానికి చూపి అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్నారు. ఆన్లైన్ వ్యాపార సంస్థలు కూడా ఈయనతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఒకప్పుడు కూలి డబ్బు తీసుకున్న ఆయన ప్రస్తుతం 40 మందికి ఉపాధి కల్పించడమేగాక ఆదాయపన్ను చెల్లించేస్థాయికి ఎదిగారు. ప్రొద్దుటూరు మిట్టమడి వీధిలో నివసిస్తున్న గుర్రం ఆంజనేయులు టెన్త్ మాత్రమే చదివారు.వంశపారంపర్యంగా వస్తున్న చేనేత వృత్తిని చేపట్టారు. క్రమేణా ఎదుగుతూ 2005లో తన కుమారుడి పేరుతో అభి సిల్క్స్ ఏర్పాటు చేశారు.
ఆయన రెండేళ్ల కిందట ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేశారు. తాను తయారు చేసిన వస్త్రాలను అందులో పెట్టారు. వాటిని మెచ్చుకున్న పలువురు కొనుగోళ్లు ప్రారంభించారు. కొత్త డిజైన్లు అందుబాటులోకి తెచ్చారు. తాను ఫేస్బుక్లో పెట్టిన వస్త్రాలను చూసి స్వయంగా మహిళలే ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారని ఆంజనేయులు ఈ సందర్భంగా తెలియజేశారు. బ్యాంక్‌లో డబ్బు వేసిన వెంటనే కొరియర్ ద్వారా పంపుతున్నామన్నారు.