డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు మే 5న నోటిఫికేషన్!
8 నుంచి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కోసం వచ్చే నెల 5న నోటిఫికేషన్ జారీ చేయాలని ఆన్లైన్ ప్రవేశాల కమిటీ భావిస్తోంది. ఈ మేరకు తాత్కాలిక షెడ్యూల్ను రూపొందించింది. మంగళవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సమావేశమైన కమిటీ ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించింది. తాత్కాలిక షెడ్యూలు ప్రకారం వచ్చే నెల 5న నోటిఫికేషన్ జారీ చేసి, 8 నుంచి 22 వరకు దరఖాస్తులు, వెబ్ ఆప్షన్లు స్వీకరించాలన్న నిర్ణయానికి వచ్చింది.
మొదటి దశ సీట్ల కేటాయింపును వచ్చే నెల 28న ప్రకటించేలా ఏర్పాట్లు చేస్తోంది. తాత్కాలిక షెడ్యూలులో కొంత మార్పు ఉండే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఈ సారి డిగ్రీ ప్రవేశాల్లో విద్యార్థుల బయోమెట్రిక్ వివరాలను సేకరించడంతో పాటు ఆధార్ నంబర్ కూడా కచ్చితంగా తీసుకోవాలని నిర్ణయించింది. గతేడాది ఆన్లైన్ ప్రవేశాల పరిధిలోకి రాని 45 కాలేజీలను కూడా ఈసారి ఆన్లైన్ ప్రవేశాలల్లోకి తీసుకొచ్చేలా కసరత్తు చేస్తోంది. డిగ్రీ కాలేజీల్లోనూ కామన్ ఫీజు విధానం తీసుకురావాలని నిర్ణయించింది.