అమ్మాయి చదువుకు సమస్య పరిష్కారం
పార్వతీపురం: ‘అమ్మాయి చదువుకు ఆన్లైన్ కష్టాలు’ శీర్షికన సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కథనం ప్రచురితమైన 24గంటలు గడవక ముందే సంబంధిత అధికారులు స్పందించారు. ఈ నెల 25న తనకు రేషన్‌కార్డు ఆన్లైన్ సమస్య వుందని, ఈ కారణంగా తనకు స్కాలర్షిప్ మంజూరు కాలేదని, ఐటీడీఏ పీఓ డా.జి.లక్ష్మీశకు కురుపాం మండలం ఈతమానుగూడకు చెందిన పాలక మౌళిక విన్నవించుకుంది. తన సమస్యను పరిష్కరించాలని వేడుకుంది.
లేకుంటే తన చదువు నిలిచిపోతుందని ప్రాధేయపడింది. ఇదే విషయాన్ని సాక్షి ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన కురుపాం తహసీల్దార్ సూర్యకళ వెనువెంటనే ఆన్లైన్ సమస్యను పరిష్కరించారు. అప్పటి వరకు ఆన్లైన్లో కేవలం మౌళికకు చెందిన వివరాలు మాత్రమే నమోదై ఉన్నాయి. ప్రస్తుతం ఆన్లైన్ సమస్య పరిష్కరించిన తరువాత కుటుంబ సభ్యుల అందరి వివరాలు ఆన్లైన్లో నమోదయ్యాయి. ఈ విషయాన్ని విద్యార్ధిని మౌళికకు సాక్షి ప్రతినిధి ఫోన్ ద్వారా సమాచారం అందించగా ఆమె సాక్షికి ధన్యవాదాలు తెలియజేసింది. సాక్షి ప్రయత్నం ద్వారా నా సమస్య పరిష్కారం కావడంతో పాటు చదువుకు ఆటంకం తొలగినందుకు రుణ పడి వుంటానని పేర్కొంది.
అమ్మాయి చదువుకు ఆన్లైన్ కష్టాలు