ఇక ఆన్లైన్లో పారిశ్రామిక లైసెన్సులు
కొత్త పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమల లైసెన్సింగ్ విధానాన్ని సులభతరం చేసేందుకు కొత్త పరిశ్రమ పెట్టాలనుకునేవారికి ఆన్లైన్లోనే లైసెన్సులు మంజూరు చేస్తామని తెలిపారు. దీనివల్ల ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్న మాట. ఈ మేరకు అసెంబ్లీలో ఆమె ఓ ప్రకటన చేశారు. ఈ లైసెన్సుల కోసమే ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్ పెడుతున్నామని, అందులో ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారం అంతా ఉంటుందని ఆమె చెప్పారు.
ఈ పోర్టల్ చూస్తే, పారిశ్రామిక వేత్తలతో పాటు సామాన్యులు కూడా ప్రభుత్వ పథకాలన్నింటి గురించి తెలుసుకోవచ్చని జయలలిత అన్నారు. ఈ పోర్టల్ తయారీకి రూ. 2.24 కోట్ల ఖర్చయినట్లు ఆమె చెప్పారు. ఇక 2014-15 సంవత్సరంలో ఒక్కోటీ రూ. 1.65 కోట్ల వ్యయంతో ఐదు జిల్లాల్లో ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీలకు కొత్త భవనాలు కట్టిస్తున్నట్లు కూడా ఆమె అసెంబ్లీలో ప్రకటించారు.