డిగ్రీ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం
జిల్లాల్లో హెల్ప్‌లైన్ కేంద్రాల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ సమాచారంలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని కళాశాల విద్యా కమిషనర్ వాణిప్రసాద్ తెలిపారు. ఇందుకోసం వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంచామని, అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవచ్చని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అలాగే హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీ ఆన్లైన్ ప్రవేశాలకు అంగీకరించిందని, విద్యార్థులు ఆ కాలేజీలో చేరేందుకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వెల్లడించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆప్షన్లకు సంబంధించి సహకారం అందించేందుకు జిల్లాల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. హెల్ప్‌లైన్ కేంద్రంలో సరైన సహకారం అందకపోతే సంబంధిత చీఫ్ కో-ఆర్డినేటర్లను సంప్రదించవచ్చన్నారు. గురువారం సాయంత్రానికి 1,21,376 మంది ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారని, అందులో 1,10,649 మంది ఆప్షన్లు ఇచ్చారని తెలిపారు.