Online retail giant
-
అమెజాన్‌కూ ఆ గతి పట్టొచ్చు..
న్యూయార్క్ : ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ కుప్పకూలుతుందని, దివాళా బాట పడుతుందని ఇప్పట్లో ఎవరూ ఊహించరు. అయితే అమెజాన్ ఏదో ఒక రోజు పతనమవుతుందని, దివాళా తీస్తుందనీ సాక్షాత్తూ సంస్థ వ్యవస్ధాపకులు జెఫ్ బెజోస్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సీటెల్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులతో జరిగిన ప్రత్యేక భేటీలో ఓ ఉద్యోగి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ బెజోస్ ఈ వ్యాఖ్యలు చేశారు. రిటైల్ రంగంలో నెలకొన్న సంక్షోభంతో పాటు అమెరికన్ డిపార్ట్మెంట్ స్టోర్ చైన్ సియర్స్ దివాళా తీయడం నుంచి మీరు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకున్నారని ఓ ఉద్యోగి అమెజాన్ అధినేతను ప్రశ్నించారు. అమెజాన్ సైతం పడిపోకుండా ఉండేంత దిగ్గజమేమీ కాదని బెజోస్ బదులిచ్చి ఉద్యోగులను విస్మయంలో ముంచెత్తారని సీఎన్‌బీసీ న్యూస్ పేర్కొంది. దిగ్గజ కంపెనీలను పరిశీలిస్తే అవి మూడు దశాబ్ధాలకు పైబడి వాటి జీవితకాలం సాగిందని, వందేళ్లకు పైగా మనుగడ కొనసాగించినవి లేవని ప్రస్తావించినట్టు తెలిపింది. అమెజాన్‌లో ఉన్న ప్రతి ఉద్యోగి సంస్థ మనుగడ ముగిసిపోకుండా వీలైనంత పొడిగించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని బెజోస్ పిలుపు ఇచ్చారు. మనం కస్టమర్లపై కాకుండా మనపైనే దృష్టి కేంద్రీకరిస్తే అదే పతనానికి ప్రారంభమవుతుందని హెచ్చరించారు. అలాంటి రోజు రాకుండా దాన్ని నివారించడానికి మనం శక్తివంచన లేకుండా ప్రయత్నించాలన్నారు. కాగా న్యూయార్క్ లాంగ్ ఐలాండ్ సిటీ ప్రాంతంతో పాటు వాషింగ్టన్ డీసీల్లో తమ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని గతవారం అమెజాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు కేంద్రాలతో రెండు నగరాల్లో 25,000కు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. -
అమెజాన్ అమేజింగ్ ఫలితాలు
బెంగళూరు : ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్ లైన్ రీటైల్ దిగ్గజం అమెజాన్.కామ్ తొలి త్రైమాసికంలో అమేజింగ్ ఫలితాలను విడుదల చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయాలను 28.2 శాతం పెంచుకుంది. ప్రైమ్ లోయల్టీ ప్రొగ్రామ్ ద్వారా ఎక్కువగా కస్టమర్లను ఆకర్షించడంతో పాటు క్లౌడ్ సర్వీసుల బిజినెస్ పెంచుకోవడంతో అమెజాన్ ఈ క్వార్టర్ ఫలితాల్లో దూసుకెళ్లింది. నికర ఆదాయం 5,130 లక్షల డాలర్లుగా నమోదుచేసింది. నికర అమ్మకాలు 22.72 బిలియన్ డాలర్ల(2272 కోట్ల డాలర్లు) నుంచి 29.13 బిలియన్ డాలర్ల(2913కోట్ల డాలర్లు) కు పెరిగాయని కంపెనీ ప్రకటించింది. 2012 నుంచి విడుదలైన ఫలితాల్లో కంపెనీకి ఇదే అతిపెద్ద వృద్ధి అని అమెజాన్ ప్రకటించింది. నిర్వహణ ఆదాయాలు సైతం మూడింతలు ఎక్కువ వృద్ధిని నమోదుచేసి 6,040 లక్షల డాలర్లుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. జనవరిలో విడుదల చేసిన గత క్వార్టర్ ఫలితాలతో పెట్టుబడిదారులను నిరాశపరిచిన అమెజాన్, ఈ ఫలితాల్లో నికర ఆదాయాలను పెంచి కొత్త ఉత్సాహాన్ని నింపింది. గురువారం అమెజాన్ ఈ ఫలితాలను ప్రకటించిన అనంతరం కంపెనీ షేర్లు ఒక్కసారిగా 13శాతం ఎగబాకాయి. -
ఈ-కామర్స్‌లోకి పేటీఎం
న్యూఢిల్లీ: మొబైల్ పేమెంట్ సేవల సంస్థ పేటీఎం తాజాగా ఈ-కామర్స్ సర్వీసులు ప్రారంభించినట్లు ప్రకటించింది. తద్వారా ఆన్లైన్ షాపింగ్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్‌తో కంపెనీ పోటీపడనుంది. ప్రస్తుతం ఈకామర్స్ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నామని, ఇప్పటిదాకా 33,000 పైచిలుకు విక్రేతలు తమ సైట్లో నమోదు చేసుకున్నారని పేటీఎం వ్యవస్థాపక సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఈ ఏడాది ఆఖరు నాటికి విక్రేతల సంఖ్య లక్షకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. ఈ కామర్స్ సేవల ద్వారా ప్రస్తుతం 1.5 బిలియన్ డాలర్లుగా ఉన్న తమ రెవెన్యూ రన్ రేట్ ఏడాది ఆఖరు నాటికి 4 బిలియన్ డాలర్లకు పెరగగలదని శర్మ చెప్పారు. నిర్దిష్ట కాల వ్యవధిలో షాపింగ్ సైటు ద్వారా అమ్ముడైన ఉత్పత్తులు, సేవల విలువను రెవెన్యూ రన్ రేట్గా పరిగణిస్తారు. తమ ప్లాట్‌ఫాంపై విక్రేతలు ఉచితంగా నమోదు చేసుకోవచ్చని, కొనుగోలుదారులు పేటీఎం ప్లాట్‌ఫాం ద్వారా చెల్లింపులు జరపాల్సి ఉంటుందని శర్మ వివరించారు. ఆన్లైన్ రిటైల్ దిగ్గజం ఆలీబాబా ఇటీవలే పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.