
ఈ-కామర్స్‌లోకి పేటీఎం
న్యూఢిల్లీ: మొబైల్ పేమెంట్ సేవల సంస్థ పేటీఎం తాజాగా ఈ-కామర్స్ సర్వీసులు ప్రారంభించినట్లు ప్రకటించింది. తద్వారా ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్‌తో కంపెనీ పోటీపడనుంది. ప్రస్తుతం ఈకామర్స్ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నామని, ఇప్పటిదాకా 33,000 పైచిలుకు విక్రేతలు తమ సైట్‌లో నమోదు చేసుకున్నారని పేటీఎం వ్యవస్థాపక సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఈ ఏడాది ఆఖరు నాటికి విక్రేతల సంఖ్య లక్షకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు.
ఈ కామర్స్ సేవల ద్వారా ప్రస్తుతం 1.5 బిలియన్ డాలర్లుగా ఉన్న తమ రెవెన్యూ రన్ రేట్ ఏడాది ఆఖరు నాటికి 4 బిలియన్ డాలర్లకు పెరగగలదని శర్మ చెప్పారు. నిర్దిష్ట కాల వ్యవధిలో షాపింగ్ సైటు ద్వారా అమ్ముడైన ఉత్పత్తులు, సేవల విలువను రెవెన్యూ రన్ రేట్‌గా పరిగణిస్తారు. తమ ప్లాట్‌ఫాంపై విక్రేతలు ఉచితంగా నమోదు చేసుకోవచ్చని, కొనుగోలుదారులు పేటీఎం ప్లాట్‌ఫాం ద్వారా చెల్లింపులు జరపాల్సి ఉంటుందని శర్మ వివరించారు. ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం ఆలీబాబా ఇటీవలే పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.