
అమెజాన్ అమేజింగ్ ఫలితాలు
బెంగళూరు : ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్ లైన్ రీటైల్ దిగ్గజం అమెజాన్.కామ్ తొలి త్రైమాసికంలో అమేజింగ్ ఫలితాలను విడుదల చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయాలను 28.2 శాతం పెంచుకుంది. ప్రైమ్ లోయల్టీ ప్రొగ్రామ్ ద్వారా ఎక్కువగా కస్టమర్లను ఆకర్షించడంతో పాటు క్లౌడ్ సర్వీసుల బిజినెస్ పెంచుకోవడంతో అమెజాన్ ఈ క్వార్టర్ ఫలితాల్లో దూసుకెళ్లింది. నికర ఆదాయం 5,130 లక్షల డాలర్లుగా నమోదుచేసింది.
నికర అమ్మకాలు 22.72 బిలియన్ డాలర్ల(2272 కోట్ల డాలర్లు) నుంచి 29.13 బిలియన్ డాలర్ల(2913కోట్ల డాలర్లు) కు పెరిగాయని కంపెనీ ప్రకటించింది. 2012 నుంచి విడుదలైన ఫలితాల్లో కంపెనీకి ఇదే అతిపెద్ద వృద్ధి అని అమెజాన్ ప్రకటించింది. నిర్వహణ ఆదాయాలు సైతం మూడింతలు ఎక్కువ వృద్ధిని నమోదుచేసి 6,040 లక్షల డాలర్లుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది.
జనవరిలో విడుదల చేసిన గత క్వార్టర్ ఫలితాలతో పెట్టుబడిదారులను నిరాశపరిచిన అమెజాన్, ఈ ఫలితాల్లో నికర ఆదాయాలను పెంచి కొత్త ఉత్సాహాన్ని నింపింది. గురువారం అమెజాన్ ఈ ఫలితాలను ప్రకటించిన అనంతరం కంపెనీ షేర్లు ఒక్కసారిగా 13శాతం ఎగబాకాయి.