షాపింగ్ సైట్ల ద్వారా స్మగ్లింగ్!
ఆన్ లైన్ షాపింగ్.. దేశంలో రోజురోజుకూ మార్కెట్ ను పెంచుకుంటూ పోతున్న ఈ రంగంపై స్మగ్లర్ల దృష్టి పడింది. ఎవరైనా తమ షాపింగ్ వెబ్ సైట్లో సెల్లర్లుగా మారొచ్చనే ఆప్షన్ ను తమకు అనుగుణంగా ఉపయోగించుకుంటున్నారు. స్వయంగా కేంద్ర పర్యావరణశాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే రాజ్యసభలో ఈ విషయాన్ని తెలిపారు. దాదాపు 106 ఆన్ లైన్ షాపింగ్ సంస్థల్లో సెల్లర్లుగా మారిన స్మగ్లర్లు జంతువుల చర్మాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) గుర్తించినట్లు చెప్పారు.
ఆస్ట్రేలియాకు చెందిన కొఆలా, పులి తదితర జంతువుల చర్మాలను అక్రమంగా దేశంలోకి తెచ్చేందుకు ఆన్ లైన్ షాపింగ్ లో అమ్మకానికి పెడుతున్నారని చెప్పారు. సెల్లర్ల సంఖ్య వేలల్లో ఉండటం వల్ల వారిని పట్టుకోవడం కష్టమౌతోందని తెలిపారు. అమెజాన్, ఈ-బే, ఓఎల్ఎక్స్, స్నాప్ డీల్ తదితర ప్రముఖ వెబ్ సైట్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయని వివరించారు. అమెజాన్, స్నాప్ డీల్ లాంటి సంస్థలకు సెల్లర్లపై పట్టుకలిగి ఉండటం వల్ల జంతువులకు సంబంధించిన బొమ్మలు, వస్తువులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.
కొద్దిరోజుల క్రితం ఓ ప్రముఖ వెబ్ సైట్ నుంచి ఆస్ట్రేలియన్ టెడ్డీ బేర్ ను రూ.2 లక్షలకు కొన్నట్లు ఓ అధికారి తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన జంతువుల చర్మాన్ని టెడ్డీ బేర్ కు ఉంచి దీనిని అమ్మకానికి పెట్టినట్లు వివరించారు. ఇందుకోసం వారు ప్రత్యేకమైన కోడ్స్ ను ఉపయోగిస్తున్నారని గుర్తించినట్లు చెప్పారు. ఈ వివరాలను అన్ని ఆన్ లైన్ షాపింగ్ సంస్థలకు అందిచామని తెలిపారు.
ఈ ఏడాది మే నెలలో గుర్తుతెలియని సెల్లర్లు పోస్టు చేసిన దాదాపు 296 జంతు సంబంధిత వస్తువుల అమ్మకాలను అమెజాన్ నిలిపివేసిందని చెప్పారు. ఈ-బే, క్విక్కర్ తదితర సైట్లకు సెల్లర్ల మీద అవగాహన సరిగా ఉండటం లేదని, మరికొన్ని సంస్థలకు అసలు దేశంలో కార్యలయాలు లేవని తెలిపారు. ఆన్ లైన్ అక్రమంగా రవాణా చేస్తున్న వస్తువులపై నిఘాను పటిష్టం చేసినట్లు వివరించారు. సంరక్షణలో ఉన్న జంతువులు, పక్షులకు చెందిన వస్తువులను అమ్మకానికి ఉంచబోమని ఓఎల్ఎక్స్ అధికార ప్రతినిధి తెలిపారు.