ఓలా క్యాబ్స్లో రతన్ టాటాకు వాటాలు
న్యూఢిల్లీ: ఆన్లైన్ ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఓలాలో పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వ్యక్తిగత హోదాలో పెట్టుబడులు పెట్టారు. అయితే, ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసినదీ, ఎంత వాటా తీసుకున్నదీ వెల్లడి కాలేదు. రతన్ టాటా ఇప్పటికే ఆన్లైన్ రిటైలర్ స్నాప్డీల్ నుంచి చైనా మొబైల్ ఫోన్ల కంపెనీ షియోమీ దాకా వివిధ స్టార్టప్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టాటా వంటి దిగ్గజం ఇన్వెస్ట్ చేయడం తమ కంపెనీకి మరింత గౌరవం తెచ్చిపెట్టిందని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థులు అగర్వాల్, అంకిత్ భాటియా కలిసి 2011లో ఓలాను ప్రారంభించారు. ప్రస్తుతం సంస్థకు దే శవ్యాప్తంగా 100 నగరాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. 1.5 లక్షల పైచిలుకు వాహనాలు ఇందులో నమోదయ్యాయి. ఓలా మొబైల్ యాప్ ద్వారా కస్టమర్లు క్యాబ్స్, ఆటోలను బుక్ చేసుకోవచ్చు.