ప్రాణం తీసిన వీడియో గేమ్ సరదా!
22 రోజులు గేమ్ ఆడి చనిపోయిన రష్యా టీనేజర్
మాస్కో: వీడియో గేమ్ పిచ్చి ముదిరితే ప్రాణాలే పోతాయని హెచ్చరించే ఉదంతమిది. రష్యాలో ఓ టీనేజర్ 22 రోజుల పాటు ఏకధాటిగా వీడియో గేమ్ ఆడి అనారోగ్యంతో మృతిచెందాడు. బాష్కోర్తోస్తాన్ రిపబ్లిక్‌లోని ఉల్చాయ్కి చెందిన 17 ఏళ్ల రుస్తాం కాలు విరగడంతో గత నెల 8 నుంచి ఇంటికే పరిమితమయ్యాడు. విసుగు పుట్టడంతో ఆన్లైన్లో ‘డిఫెన్స్ ఆఫ్ ది ఏన్షియంట్స్’ గేమ్‌ను విపరీతంగా ఆడాడు.
తిండి, నిద్ర తప్పిస్తే మిగతా సమయమంతా అదే పని. తల్లిదండ్రులు వాళ్ల ఉద్యోగాల్లో పడిపోయి అతని సంగతి పెద్దగా పట్టించుకోలేదు. గత నెల 30న అతని గదిలోంచి కీ బోర్డు చప్పుడు వినిపించలేదు. తల్లిదండ్రులు లోనికెళ్లి చూడగా అతడు స్పృహ తప్పి కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నడక, ఇతర శారీకర కదలికల్లేకపోవడంతో రక్తం గడ్డకట్టడం వల్ల రుస్తాం చనిపోయి ఉంటాడని వైద్యులు భావిస్తున్నారు.
అన్నట్టు.. రుస్తాం విగతజీవి అయ్యేముందు తనకిష్టమైన ఆ గేమ్‌లోని తన పాత్ర చనిపోవడం చూశాడట. అతడు గత ఏడాదిన్నరలో 2 వేల గంటలకు పైగా గేమ్ అడినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. రుస్తాం మృతి తల్లిదండ్రులకు గట్టి హెచ్చరిక అని బాలల హక్కుల అధికారి పావెల్ అస్తాఖోవ్ అన్నారు.
వారు తమ పిల్లలను వారి మానాన వారిని వదిలేయకుండా ఒక కన్నేసి ఉంచాలని, కంప్యూటర్లకు, ఇంటర్నెట్కు, వీడియోగేమ్‌లకు బానిసలను చేయొద్దని సూచించారు. ఈ ఏడాది మార్చిలో చైనాలో ఓ 23 ఏళ్ల యువకుడు ఇంటర్నెట్ కఫేలో 19 గంటలు ఏకధాటిగా వీడియో గేమ్ ఆడి చనిపోవడం తెలిసిందే.