భారత్ లో నోకియా 3310 ధరెంతో రివీల్!
నోకియా ఐకానిక్ మోడల్ 3310.. సరికొత్త ఫీచర్లతో అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరణైంది. సరికొత్త ఫీచర్లతో బార్సిలోనా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఈ కొత్త నోకియా 3310 ను హెచ్ఎండీ గ్లోబల్ ఆవిష్కరించింది. మరో మూడు రోజుల్లో ఈ ఫోన్ జర్మనీ, ఆస్ట్రియాలో అమ్మకానికి వస్తోంది. ఆసక్తికరంగా భారత్ కు చెందిన ఓ రిటైలర్ సైట్ ఈ ఫోన్ ధర దేశీయంగా ఎంత ఉండబోతుందో రివీల్ చేసేసింది. ఇండియన్ రిటైలర్ ఓన్లిమొబైల్స్.కామ్ నోకియా 3310(2017) ఫోన్ ను కంపెనీ వెబ్ సైట్లో పొందుపరిచి, ధర 3,899 రూపాయలని పేర్కొంది. ''కమింగ్ సూన్'' అని కూడా లిస్ట్ చేసింది. స్పెషిఫికేషన్లను పక్కనపెడితే, మొత్తం నాలుగు రంగుల్లో ఇది అందుబాటులో ఉండనున్నట్టు వెబ్ సైట్ తెలిపింది.
వార్మ్ రెడ్, డార్క్ బ్లూ, ఎల్లో, గ్రే రంగుల ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంటుందట. అయితే ఇప్పటివరకు భారత్ లో దీని ధర వివరాలు, అందుబాటులోకి తీసుకురాబోతున్న వివరాలను హెచ్ఎండీ గ్లోబల్ అధికారికంగా వెల్లడించలేదు. నోకియా బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ల కంటే కాస్త ముందుగానే ఈ 3310 మోడల్ ను క్యూ2లో భారత్ లోకి తీసుకురాబోతుందని మాత్రమే తెలిసింది. అయితే ఓన్లిమొబైల్ లిస్ట్ చేసిన ధర వివరాలను అనధికారికమైనవని కంపెనీ ధృవీకరించింది. ఇక ఫీచర్ల సంగతికి వస్తే కలర్ డిస్ప్లే, 2.4 అంగుళాల స్ర్కీన్, రెండు మైక్రో సిమ్ స్లాట్స్, 2 మెగా పిక్సల్ కెమెరా, 16ఎంబీ స్టోరేజ్, 32జీబీ వరకు విస్తరణ మెమరీ, 22 గంటల టాక్‌టైమ్, 31 రోజుల స్టాండ్‌బై కలిగివుంటుందని సంస్థ తెలిపింది. అప్పటి మోడల్‌తో పోలిస్తే స్వల్ప మార్చుచేర్పులతో రాబోతోన్న ఈ ఫోన్‌కు హైపర్ రిసెస్టింగ్ హౌసింగ్ ప్రధాన ఆకర్షణ కానుంది.