ఆవుదూడను చంపిన చిరుత
చెన్నేకొత్తపల్లి : ఒంటికొండ గ్రామ సమీపంలో గురువారం రాత్రి ఆవుదూడను చిరుత చంపేసింది. బాధితుడి కథనం మేరకు.. రైతు రామకష్ణారెడ్డికి గ్రామ సమీపంలో పశువుల పాక ఉంది. రోజులాగే గురువారం రాత్రి పదిగంటల సమయంలో రైతు పాడిపశువులకు గడ్డిని వేసి ఇంటికి వచ్చాడు. శుక్రవారం ఉదయం పశువుల పాక వద్దకు వచ్చి చూడగా ఆవుదూడ చనిపోయి ఉంది. అక్కడి ఆనవాళ్లను బట్టి చూస్తే చిరుత దాడి చేసి చంపినట్లు గుర్తించి గ్రామస్తులకు తెలియజేశాడు. గంగినేపల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నాగప్ప సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు.
చిరుత సంచారంతో బెంబేలు
చిరుత సంచారంతో ఒంటికొండ గ్రామ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నెలన్నర కిందట కూడా గొర్రెలమందపై చిరుత దాడి చేసి నాలుగు పిల్లలను ఎత్తుకెళ్లిందని గ్రామస్తులు తెలిపారు. వరుస ఘటనలతో రైతులు, గొర్రెల కాపరులు పొలాల వైపు రావడానికి భయపడుతున్నారు. చిరుతల బారి నుంచి తమను కాపాడాలని వారు కోరుతున్నారు.