OP Jaisha
-
అథ్లెట్ జైశాకు స్వైన్ ఫ్లూ
న్యూఢిల్లీ: తనకు రియో ఒలింపిక్స్ మారథాన్ రన్లో కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని అధికారులపై ఆరోపణలు చేసిన భారత మహిళా అథ్లెట్ ఓపీ జైశా స్వ్లైన్ ఫ్లూ బారిన పడింది. రియో ఒలింపిక్స్ ముగిసిన అనంతరం భారత్ కు వచ్చిన జైశా అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు బెంగళూరులోని ఆస్పత్రిలో అందిస్తున్నారు. దీనిలో భాగంగా జైశాకు నిర్వహించిన పరీక్షల్లో స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్దారణ అయ్యింది. జైశా ఆరోగ్యంపై స్పోర్ట్స్ అథారిటీ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ డా. ఎస్ సరళ స్పందించారు. అథ్లెట్ జైశాకు స్వైన్ జాతికి చెందిన హెచ్1ఎన్1 వైరస్ సోకినట్లు పేర్కొన్నారు. జైశా ఆరోగ్యంపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రత్యేక డాక్టర్ల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, రియో ఒలింపిక్స్ అనంతరం పలువుర భారత అథ్లెట్లు అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో కొంతమంది చికిత్స అనంతరం ఇంటికి చేరగా, స్టీపుల్ చేజ్ క్రీడాకారిణి సుధాకు జికా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సుధాకు బెంగుళూరులోని స్పోర్ట్స్ అథారిటీ హాస్టల్లో చికిత్స అందిస్తున్నారు. -
జైశా ఆరోపణలపై స్పందించిన కేంద్ర మంత్రి
రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్ ఓపీ జైశా తాను ఎదుర్కొన్న పరిస్థితులపై చేసిన ఆరోపణలపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ స్పందించారు. మారథాన్ రన్నర్ ఓపీ జైశా ఆరోపణలపై విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇద్దరు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటుచేశారు. వారం రోజుల్లో విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పించాలని విచారణ అధికారులకు గోయల్ సూచించారు. ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చినా అథ్లెట్లు తీసుకోలేదని అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) చేసిన ప్రకటనలో వాస్తవం లేదని మారథాన్ రన్నర్ ఓపీ జైశా పేర్కొంది. రియోలో 42 కిలోమీటర్ల మారథాన్ పోటీలో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన తనకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని జైశా ఆరోపించింది. 'నిజమేంటో ఏఎఫ్ఐ ప్రతినిధులకు తెలుసు. నేను పోటీలో పాల్గొన్న చోట కెమెరాలు ఉన్నాయి. వీడియో ఫుటేజీ పరిశీలిస్తే వాస్తవం వెల్లడవుతుంది. అబద్దాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు' అని జైశా స్పష్టం చేసిన నేపథ్యంలో స్పందించిన కేంద్ర మంత్రి విచారణకు ఆదేశించారు. -
'నిజం నాకు, దేవుడికే తెలుసు'
బెంగళూరు: తాము ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చినా తీసుకోలేదని అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) చేసిన ప్రకటనపై మారథాన్ రన్నర్ ఓపీ జైశా స్పందించింది. ఏఎఫ్ఐ ప్రతినిధులు అసలు తనకు దగ్గరకు రాకుండా ఎనర్జీ డ్రింక్స్ ఎలా ఆఫర్ చేశారని ఆమె ప్రశ్నించింది. రియో ఒలింపిక్స్ లో 42 కిలోమీటర్ల మారథాన్ పోటీలో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన తనకు కనీసం మంచినీళ్లు ఇవ్వలేదని జైశా వాపోయింది. అయితే తాము ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చినా జైశా, ఆమె కోచ్ తీసుకోలేదని ఏఎఫ్ఐ తెలిపింది. దీనిపై జైశా స్పందిస్తూ... 'మాకు పానీయాలు ఇవ్వలేదు. నిజమేంటో ఏఎఫ్ఐ ప్రతినిధులకు తెలుసు. నేను పోటీలో పాల్గొన్న చోట కెమెరాలు ఉన్నాయి. వీడియో ఫుటేజీ పరిశీలిస్తే వాస్తవం వెల్లడవుతుంది. అబద్దాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా క్రీడా జీవితంలో ఇప్పటివరకు ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదు. ప్రభుత్వానికి లేదా ఏఎఫ్‌ఐకు వ్యతిరేకంగా నేను పోరాటం చేయలేను. కానీ నిజమేంటో దేవుడికి, నాకు తెలుసు. రియో ఒలింపిక్స్ లో నా పట్ల దారుణంగా వ్యవహరించారు. అలసట తీర్చుకోవడానికి నేను ఒప్పుకోలేదని ఇప్పటీకి ఏఎఫ్ఐ చెబుతోంద'ని జైశా వాపోయింది.