OP patients
-
ఉస్మానియాలో కలకలం: డ్యూటీ డాక్టర్ నెత్తిన పడిన ఫ్యాన్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో సోమవారం ప్రమాదం సంభవించింది. ఓపీలో డెర్మటాలజీ విభాగంలో.. విధులు నిర్వర్తిస్తున్నడాక్టర్ భువనశ్రీపై ఒక్కసారిగా ఫ్యాన్ ఊడిపడింది. దీంతో ఆమె కింద పడిపోయింది. ఈ క్రమంలో భువనశ్రీ తలకి తీవ్ర గాయమైంది. తోటి డాక్టరు వెంటనే ఆమెకు కట్లు కట్టారు. ప్రస్తుతం డాక్టర్ భువనశ్రీకి ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న వరుస ప్రమాదాలతో పెషేంట్లు, డాక్టర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఎన్నో అనుమానాలు.. ‘మొహంపై గీతలు, రక్తం, కన్ను గుడ్డు లేదు’ -
ఒక రోగి ఎన్ని ఓపీ కార్డులు తేవాలి..?
సాక్షి, సిటీబ్యూరో: నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో రోగులు దోపిడీకి గురవుతున్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్య సేవలను అందిస్తున్న దృక్ఫథంతో తెలంగాణ ప్రభుత్వం నిమ్స్ ఆసుపత్రిని ప్రత్యేక తరహాలో నిర్వహిస్తోంది. అయితే స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన ఈ ఆసుపత్రిలో పాలకులు చిత్తం వచ్చినట్టు నియమ నిబంధనలు విధించడంతో రోగుల పాలిట శాపంగా మారింది. అభివృద్ధి పేరిట, ప్రభుత్వం వద్ద తాము ఆదాయం వనరులను చూపించే క్రమంలో ఆసుపత్రి యాజమాన్యం తమకు తోచిన విధంగా రూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శ లేకపోలేదు. పెరుగుతున్న రోగులకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన యాజ మాన్యం వారికి భారంగా తయారైందనే వ్యాఖ్యలు సర్వత్రా వినవస్తున్నాయి. ఓపీ కార్డులు తీసుకోవాల్సిందే.. ఆస్పత్రి ఒక్కటే అయినప్పటికీ రెండు మూడు ఓపీ కార్డులు తీసుకోవాల్సిన పరిస్థితి. ఏ డిపార్టుమెంట్‌కు ఆ డిపార్టుమెంట్ ఓపీ కౌంటర్లో ఓపీ కార్డు తీసుకోవాల్సిందేనని నిమ్స్ ఉద్యోగులు హుకుం జారీ చేస్తున్నారు. బుధవారం ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగయ్య అనే రోగి శస్త్ర చికిత్స నిమిత్తం నిమ్స్‌ను వచ్చాడు. సర్జకల్ ఆంకాలజీ విభాగంలో ఓపీ కార్డు తీసుకొని వైద్యుడిని సంప్రదించారు. ఆయనను పరీక్షించిన ఆ విభాగం వైద్యులు. కేసు క్రిటికల్‌గా ఉంది. ఒకసారి కార్డియాలజీ విభాగంలో చూపించుకోవాల్సిందిగా సూచించారు. దాంతో అక్కడి వైద్యుడిని కలవడానికి వెళ్లగా ఓపీ కార్డు తీసుకురమ్మని సిబ్బంది ఆదేశించారు. అదేంటి ఓపీ కార్డు తీసుకున్నాం కదా అని.. సర్జికల్ ఆంకాలజీ విభాగానికి సంబంధించి తీసుకున్న ఓపీ కార్డును సంగయ్య సహాయకురాలు చూపించారు. ఇది.. కార్డియాలజీ ఓపీలో కార్డు తీసుకురావాలని చెప్పారు. ఒక రోజుకు ఒకే రోగి రెండు, మూడు ఓపీ కార్డులను తీసుకోవడమంటే ఎంత వరకు సమంజమని రోగి సహాయకులు ప్రశ్నిస్తున్నారు. నిమ్స్ యాజమాన్య వైఖరిపై ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పటాన్‌చెరువుకు చెందిన రోగి సహయకుడు సంజయ్ అభిప్రాయపడుతున్నారు. గతంలో అయితే.. గతంలో అయితే ఒకసారి ఓపీ కార్డు తీసుకుంటే ఆ కార్డు మీద దాదాపుగా 15 రోజులు వైద్యులను సంప్రందించడానికి అవకాశం ఉండేది. అప్పట్లో ఓపీ కార్డు కూడా కేవలం రూ. 50లకే జారీ చేసేవాళ్లు. దాంతోనే ఆసు పత్రిలోని 28 సూపరు స్పెషాలిటీ విభా గాలల్లోనూ ఆయా వైద్యులను కలుసుకునే వెలుసుబాటు రోగులకు ఉండేది. అలాంటిది.. యాజమాన్యం తాజాగా తీసుకున్న నిర్ణ యాల వల్ల ఓపీ కార్డు కూడా మొబైల్‌కి వచ్చే ఓటీపీ చందంగా తయారైందని పలువురు రోగులు, వారి సహాయకులు వాపోతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా ఈ విధమైన వైఖరి లేదనీ, ఇక్కడ అంతకు మించి దోపిడీ జరుగుతుందన్నారు. ఏ విభాగానికి ఆ ఓపీ కార్డు ప్రత్యేకం.. ఓపీ కార్డు విషయమై సంబంధిత ఆర్ఎంఓని సంప్రదించగా ఆసుపత్రి వైద్యసేవలన్నీ కంప్యూటీకరణ చేయడం జరిగిందని చెప్పారు. దాని వల్ల ఏ డిపార్టుమెంట్‌కు ఆ డిపార్టుమెంట్‌కు సంబంధించి విధిగా ఓపీ కార్డు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఆయా విభాగాలలో ప్రత్యేకంగా ఓపీ కార్డులను జారీ చేస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని ఆసుపత్రి పరిపాలనా అధికారి కూడా ధ్రువీకరించడం గమనార్హం. -
‘ఉస్మానియా’ తరలింపు మళ్లీ మొదటికి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలోని రోగుల తరలింపు వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ముందస్తు ప్రణాళిక లేకుండా ఆగమేఘాల మీద రోగుల తరలింపు ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వం తీరా కొంత మంది వైద్యులు, రోగుల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం కావడంతో మళ్లీ పునరాలోచనలో పడింది. తాజాగా శుక్రవారం మంత్రి సి.లక్ష్మారెడ్డి ఉస్మానియాకు వచ్చిన వైద్యాధికారులతో విస్తృతంగా చర్చించారు. సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రి వైద్యుల నుంచి నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆ ఆస్పత్రిని అక్కడి నుంచి పేట్లబురుజుకు తరలించకపోవడమే మంచిదనే భావనకు వచ్చినట్లు తెలిసింది. అయితే పాత భవనంలోని రోగులను పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి మూడు, నాలుగో అంతస్తుకు తరలించాలా? లేక ప్రస్తుత ఓపీ బ్లాక్‌లోనే సర్దుబాటు చేయా లా? అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. సూపర్‌స్పెషాలిటీ విభాగాలపై చర్చ... ఆస్పత్రికి అవుట్ పేషంట్ విభాగానికి ప్రతి రోజూ 1500-2000 మంది రోగులు వస్తుంటారు. వీరిలో 90 శాతం మంది రోగులు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్ బాధితులే. కేవలం 10 శాతం మంది మాత్రమే సూపర్ స్పెషాలిటీ బాధితులు ఉంటారు. రోగుల ఒత్తిడి ఎక్కువగా ఉన్న జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ విభాగాలను ఓపీ బ్లాక్, కులీకుతుబ్‌షా బ్లాక్‌లో సర్దుబాటు చేసి, అక్కడ ఉన్న బర్నింగ్ వార్డు సహా నెఫ్రాలజీ, పాథాలజీ, కార్డియాలజీ విభాగాలను తరలిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన కూడా వచ్చింది. భవిష్యత్తులో వైద్యుల మధ్య విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు ఆయా విభాగాల వైద్యులను సంప్రదించి వారీ అంగీకారం మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. భారీగా తగ్గిన ఓపీ రోగులు ఉస్మానియా తరలింపు నేపథ్యంలో ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి వస్తున్న రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సాధారణ రోజుల్లో ప్రతి రోజూ 1500-2000 మంది రోగులు వస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 700-800కు తగ్గింది. ఇన్‌పేషంట్ల సంఖ్య కూడా బాగా తగ్గింది. తరలింపుపై వైద్యుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయడం కొసమెరుపు.