ఆరు ఎయిర్పోర్టుల ప్రైవేటీకరణ...!
న్యూఢిల్లీ: ఎంపిక చేసిన ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకు అనుగుణంగా అర్హతకు సంబంధించిన అభ్యర్థన(ఆర్ఎఫ్క్యూ) డాక్యుమెంట్ను పౌరవిమానయాన శాఖ కొన్నిరోజుల్లో జారీ చేయనున్నట్లు సమాచారం.వీటిలో కోల్కతా, చెన్నైసహా జోధ్పూర్, గౌహతి, అహ్మదాబాద్, లక్నో ఉన్నాయి. ప్రైవేట్ పార్టీలకు కన్సెషన్ ప్రాతిపదికన 30 ఏళ్లకు విమానాశ్రయాలను ఇవ్వనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కు భాగంలేకుండా పూర్తి వాటాను ప్రైవేట్ సంస్థలకు కేటాయించనున్నట్లు తెలిపాయి. అయితే 30 ఏళ్ల కాలంలో బిడ్డర్లతో చర్చలకు అనుగుణంగా ఆదాయ పంపకం ఉంటుందని తెలియజేశాయి. కాగా, ఏఏఐకు ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలలో 26% చొప్పున వాటా ఉండగా, హైదరాబాద్, బెంగళూరుల్లో సైతం 13% చొప్పున వాటా కలిగి ఉన్న సంగతి తెలిసిందే.