బయటపడుతూనే ఉన్న నయీమ్ నీడలు
పోలీసుల అదుపులో నయీమ్ డ్రైవర్?
చర్లలో తనిఖీల్లో పట్టుబడిన శామ్యూల్
ఛత్తీస్‌గఢ్ పారిపోతూ చిక్కిన వైనం
9 ఎంఎం పిస్టల్, 6 బుల్లెట్లు స్వాధీనం
నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన రోజు సెలవులో..
26 వరకు రిమాండ్.. ఖమ్మం తరలింపు
సరిహద్దులో మూడు రోజులుగా విస్తృత సోదాలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం/ చర్ల:
ఛత్తీస్‌గఢ్ సరిహద్దున ఉన్న మండలాలపై పోలీసులు డేగ కన్ను వేశారు. ఈ తనిఖీల్లో భాగంగా గ్యాంగ్‌స్టర్ నయీమ్ కారు డ్రైవర్ గంధం శామ్యూల్‌ను చర్లలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇతను ఛత్తీస్‌గఢ్ పారిపోతుండగా తనిఖీల్లో పోలీసులకు చిక్కినట్లు సమాచారం. అతన్ని భద్రాచలం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఈనెల 26వ తేదీ వరకు రిమాండ్ నిమిత్తం ఖమ్మం తరలించినట్లు తెలుస్తోంది. కానీ చర్ల సీఐ సాయిరమణ మాత్రం తామెవరినీ పట్టుకోలేదని చెబుతుండటం గమనార్హం.
నయీమ్‌కు ఎలా ఆ రాష్ట్రంతో సంబంధాలు ఏర్పడి ఉండవచ్చు..!
గతంలో ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు మావోయిస్టుల సమాచారం ఇవ్వడం ద్వారా కూడా నయీమ్‌కు అక్కడ సంబంధాలు ఏర్పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. నయీమ్ అనుచరులు ఛత్తీస్‌గఢ్ పారిపోయే అవకాశం ఉందన్న రాష్ట్ర పోలీసుల అధికారుల సూచనలతో సరిహద్దులోని వెంకటాపురం, వాజేడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో మూడు రోజులగా తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లోనే శామ్యూల్ పోలీసులకు పట్టుబడ్డాడని తెలిసింది.
సరిహద్దులో మరింత అలర్ట్
నయీమ్ కారు డ్రైవర్‌గా భావిస్తున్న గంధం శామ్యూల్ చర్లలో తనిఖీల్లో పట్టబడడంతో ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసులు మరింత అలర్టయ్యారు. లొంగిపోయిన తర్వాత నయీమ్ రాష్ట్ర పోలీసులతో పాటు ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులకు కూడా మావోయిస్టుల సమాచారం ఇచ్చినట్లు సమాచారం. ఆ రాష్ట్రంలోని సుకుమా, జగ్దల్పూర్, బీజాపూర్, కాంకేడ్ ప్రాంతాల్లో ఉంటూ కాంట్రాక్టర్‌గా పనులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడ నయీమ్ పెద్ద ఎత్తున తన అనుచరులును ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాలకు ఖమ్మం మీదుగానే వెళ్లాలి. నయీమ్ 2011కి ముందు ఛత్తీస్‌గఢ్‌కు తన అనుచరులతో పలుమార్లు వెళ్లినట్లు ఈ సంఘటన ఆధారంగా తెలుస్తోంది. అతని వద్ద కారు డ్రైవర్‌గా పని చేసిన శామ్యూల్‌కు ఈ రూట్ తెలవడం, ఛత్తీస్‌గఢ్‌లో నయీమ్ అనుచరులు ఎవరైనా షెల్టర్ ఇస్తారనే ఉద్దేశంతో పారిపోతూ చర్లలో పోలీసుకు చిక్కాడు. అతని వద్ద 9 ఎంఎం పిస్టల్, 6 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పోలీసుల విచారణలో తనది మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం మచ్చల గ్రామం అని, నయీమ్‌కు కొంతకాలం కారు డ్రైవర్‌గా పనిచేసినట్లు చెప్పినట్లు తెలిసింది. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన రోజు సెలవులో ఉన్నట్లు పేర్కొనట్లు సమాచారం. ఈ సంఘటనతో ఒక్క సారిగా ఉలికిపడిన జిల్లా పోలీసు అధికారులు ప్రధాన రహదారుల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని, ఏజెన్సీ మండలాల్లో అలర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
జిల్లా మీదుగా నయీమ్ అటు .. ఇటు..
గాంధీనగర్‌కాలనీలో ఇంటిని కొనుగోలు చేసి డెన్ ఏర్పాటు చేసుకున్న నయీమ్ పలుమార్లు భువనగిరి నుంచి వరంగల్ జిల్లా తొర్రూరు.. ఖమ్మం మీదుగా విజయవాడ వెళ్లినట్లే.. ఛత్తీస్‌గఢ్ కూడా వెళ్లినట్లు శామ్యూల్ పోలీసులకు చిక్కడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ నయీమ్ కేసు విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయడంతో అతనితో సంబంధం ఉన్న చాలా మంది ఆజ్ఞాతంలోకి వెళ్లారు. రాజధానిలో ఉంటున్న అనుచరుల్లో తమపై ఎప్పుడు సిట్ దాడి చేస్తుందోనని రహస్య ప్రదేశాల్లో ఉంటున్నారు. శామ్యూల్ తానుకూడా పట్టుబడతానని ఖమ్మం మీదుగా ఛత్తీస్‌గఢ్ పారిపాయే ప్రయత్నాల్లో పోలీసులకు చిక్కాడు. ఇతను నయీమ్ వాహనం నడుపుతూ చాలాసార్లు ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లడంతో అక్కడ షెల్టర్ తీసుకోవడానికే వెళ్తున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. నయీమ్ జిల్లా మీదుగా ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లకపోతే శామ్యూల్‌కు ఆప్రాంత ఎలా తెలిసి ఉంటుందన్న కోణంలో కూడా పోలీసులు అతని నుంచి సమాచారం రాబట్టినట్లు తెలిసింది. కాగా శామ్యూల్ శనివారం రాత్రే బస్సులో భద్రాచలం చేరుకొని ఇక్కడ బస చేసి ఆదివారం తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరి చర్లలో పోలీసులకు పట్టుబడ్డాడని సమాచారం.
నయీమ్ జాడలేదంటూనే..
నల్లగొండ, హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకే విస్తరించిన నయీమ్ నేర సామ్రాజ్యం నీడలు జిల్లాలో కూడా ఉండడంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. శామ్యూల్ పట్టుబడడంతో నయీమ్ కచ్చితంగా జిల్లా మీదుగా ఛత్తీస్‌గఢ్ పలుమార్లు వెళ్లిఉంటాడని భావిస్తున్నారు. జిల్లాలో ఇంకా ఎవరితోనైనా అతనికి సంబంధాలు ఉన్నాయా..? భూదందాలు ఏమైనా చేశాడా? అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం. గాంధీనగర్‌లో నయీమ్ కొనుగోలు చేసిన ఇంట్లో కొంతకాలం అతని అత్త బీబమ్మ (సుల్తానాబేగం) ఉండడంతో ఈ సమాచారం అంతా పోలీసు అధికారులు ఇప్పటికే సిట్‌కు చేర వేశారు. అసలు ఇక్కడే నయీమ్ ఇంటిని ఎందుకు కొనుగోలు చేశాడు..? అతనికి ఎవరు సహకరించారని పోలీసులు లోతుగా పరిశోధన ప్రారంభించారు. మొత్తంగా జిల్లాలో నయీమ్ జాడలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో జిల్లా పోలీసులు అలర్టయ్యారు.